కరెంటు తీగలపై కూలిన విమానం

కరెంటు తీగలపై కూలిన విమానం

గైథర్స్ బర్గ్: ఇద్దరిని  తీసుకెళ్తున్న ఓ చిన్న విమానం ప్రమాదవశాతు కరెంటు ఉన్న తీగలపై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పైలట్, మరో వ్యక్తి సేఫ్ గా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే కరెంటు తీగలపై విమానం పడిపోవడంతో మాంట్ గోమరి కౌంటీలో 5 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సింగిల్ ఇంజన్ ఉన్న విమానం న్యూయార్క్ లోని వైట్ ప్లెయిన్స్ నుంచి ఆదివారం సాయంత్రం బయల్దేరిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

మార్గం మధ్యలో అది మేరీల్యాండ్ లో గైథర్స్ బర్గ్ లోని మాంట్ గోమరి కౌంటీలో 5.40 గంటలకు విద్యుత్ తీగలపై కూలిపోయిందని ఎఫ్ఏఏ వెల్లడించింది. ‘‘ప్రమాదం గురించి తెలియగానే ఎలక్ట్రిక్ కంపెనీని పిలిపించి సహాయ కార్యక్రమాలు ప్రారంభించాం. విమానాన్ని కరెంట్ వైర్ల నుంచి బయటకు తీయడానికి విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో మాంట్ గోమరిలో 80 వేల మందికి కరెంటు లేకుండా పోయింది. దీంతో కౌంటీ అంతా చీకటి నెలకొంది. ఐదు గంటలపాటు శ్రమించిన తర్వాత విమానంలో ఉన్న ఇద్దరిని బయటకు తీయగలిగాం” అని ఎఫ్ఏఏ తెలిపింది. విమానం భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న కరెంటు వైర్లలో ఇరుక్కుపోయిందని, ఆ సమయంలో వైర్లలో కరెంట్ పాస్ అవుతోందని అధికారులు వెల్లడించారు. ప్లేన్ క్రాష్​పై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.