నారాయణగూడ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హిమాయత్‌నగర్ నుంచి సీఎం నివాసం వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామన్న కాంగ్రెస్, రెండేండ్లు గడిచినా పట్టించుకోకపోవడం వల్ల 15 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం ఆపబోమని, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

