
చేవెళ్ల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్కోడ్ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి డిమాండ్చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని ఆరోపించారు.
ప్రతీ కార్మికుడికి నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలన్నారు. ఇందుకోసం మంగళవారం నుంచి జులై 9 వరకు నిరసన ర్యాలీలు చేపట్టాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సీపీఐ చేవెళ్ల మండల కార్యదర్శి ఎం.సత్తిరెడ్డి, షాబాద్మండల కార్యదర్శి నక్క జంగయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు సుధాకర్ గౌడ్, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు జె.అంజయ్య, ఉపాధ్యక్షుడు ఎండీ.మక్బూల్, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు శివ, జిల్లా కౌన్సిల్ సభ్యులు మంజుల, మీనాక్షి, లలిత, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సంక్షేమ భవనం ఎదుట నిరసన
ముషీరాబాద్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బహుజన, వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. మంగళవారం చిక్కడపల్లిలోని టంగుటూరి అంజన్న కార్మిక సంక్షేమ భవనం ఎదుట నిరసన తెలిపారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం రూ.26 వేలు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల జీఎస్టీ మినహాయించాలని కోరారు. అనంతరం జేసీఎల్ఆర్.చంద్రశేఖరానికి వినతిపత్రం అందించారు. నాయకులు చంద్రశేఖర్, ప్రసాద్, తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి, మారోజు, సునీల్, పాండు, సునీత, రేణుక తదితరులు పాల్గొన్నారు.