రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగంలో కాంట్రాక్ట్ నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, అక్రమంగా ఎంపికైన సిబ్బందిని తొలగించాలని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వేణు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. డీసీపీయూలో కాంట్రాక్ట్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తిరిగి పారదర్శకంగా చేపట్టాలన్నారు. గత ఎనిమిదేండ్లుగా విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులకు ముందస్తు నోటీసులు లేదా టర్మినేషన్ ఉత్తర్వులు ఇవ్వకుండా వారి స్థానాలకే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటిని పక్కనబెట్టారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్చేశారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన చోట ఇతర జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేశారని, దీంతో స్థానిక అర్హులైన నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నోటిఫికేషన్‌లో మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ వెయిటేజ్, అనుభవ మార్కులు,ఎంపిక విధానాన్ని స్పష్టంగా వెల్లడించలేదని పేర్కొన్నారు. ఏఐటీయూసీ జిల్లా సెక్రటరీ కడారి రాములు తదితరులు ఉన్నారు.
