- మ్యాన్ పవర్ రేషనలైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- ఏఐవైఎఫ్ డిమాండ్
నారాయణగూడ, వెలుగు: భారత రైల్వే బోర్డు ప్రతిపాదించిన “మ్యాన్ పవర్ రేషనలైజేషన్ 2026–-27” నిర్ణయాన్ని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఖండించింది. సోమవారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో నేతలు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. రేషనలైజేషన్ పేరుతో రైల్వేల్లో సుమారు 2 శాతం (దాదాపు 29,608) పోస్టులను తగ్గించడం దేశ యువత భవిష్యత్తును దెబ్బతీయడమేనని విమర్శించారు.
ఇప్పటికే లక్షలాది ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా కొత్తగా పోస్టులను కుదించడం అన్యాయమని, సిబ్బంది కొరత వల్ల రైల్వే భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన ఆర్ఆర్బీ ఫలితాలను వెంటనే విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మే 5 నుంచి 7 వరకు పోస్టుకార్డు, ఈమెయిల్ ఉద్యమాన్ని, మే 8న హైదరాబాద్ రైల్ నిలయం ముట్టడిని చేపట్టనున్నట్లు ప్రకటించారు.
