స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు ఆదివారం నాడు ఊహించని మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇరాన్ ప్రతినిధుల బృందం హఠాత్తుగా కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ ఊహించని పరిణామం అక్కడే ఉన్న పాకిస్తాన్, అమెరికా అధికారులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.
దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఏదో మాట్లాడి, వెంటనే వెనక్కి తిరిగి తన బృందంతో సహా రూమ్ నుండి బయటకు వెళ్లడం కనిపించింది. ఈ హఠాత్ పరిణామంతో ఆశ్చర్యపోయిన షరీఫ్.. పక్కనే ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వైపు సైగలు చేశారు. కేవలం కొద్ది అడుగుల దూరంలోనే నిలబడి ఇదంతా చూస్తున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. ఆ తర్వాత పాక్ వద్దకు వచ్చారు.
🇵🇰🇮🇷🇺🇸 The body language from Geneva tells the WHOLE story by itself
— Mario Nawfal (@MarioNawfal) June 21, 2026
Araghchi walks in. Shehbaz goes in for the hug, clearly expecting the agreed script to play out.
Then Araghchi makes clear Iran isn't doing the photo-op or the opening speeches. And you can watch the… https://t.co/IR2fCReYKk
ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా, ఇరాన్, పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్య కుదిరిన ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ లో భాగంగా ఈ మొదటి రౌండ్ చర్చలు జరిగాయి. అయితే చర్చలు ప్రారంభం కావడానికి ముందే వాతావరణం వేడెక్కింది. అమెరికా బృందంతో కలిసి గ్రూప్ ఫోటో దిగడానికి ఇరాన్ నిరాకరించింది. అదంతా అమెరికా చేస్తున్న మీడియా షో అంటూ కొట్టిపారేసింది.
ఈ ఉద్రిక్తతలకు అసలు కారణం ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్. లెబనాన్‌లోని హెజ్బుల్లా ప్రాక్సీలను ఇరాన్ వెంటనే అదుపు చేయాలి. లేకపోతే గత వారం కంటే మరింత ఘోరంగా ఇరాన్‌పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో రాసుకొచ్చారు. ఈ బెదిరింపులపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. వాషింగ్టన్ ధోరణిని నిరసిస్తూనే తాము వాకౌట్ చేసినట్లు ఇరాన్ మీడియా స్పష్టం చేసింది.
అయినప్పటికీ ఈ చర్చలు పూర్తిగా ఫెయిల్ కాలేదు. కాసేపటి తర్వాత ఇరుపక్షాలు దాదాపు 80 నిమిషాల పాటు చర్చలు జరిపాయి. ఆంక్షల సడలింపు, ఇరాన్ ఫ్రీజ్డ్ అకౌంట్ల విడుదలపై సానుకూల చర్చలు జరిగాయి. ఖతార్ భాగస్వామ్యంతో ఇరాన్ నిధుల విడుదల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ చిన్న వాకౌట్ ఘటన అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఎంత సున్నితమైన దారిలో సాగుతున్నాయో ప్రపంచానికి మరోసారి చూపించింది.
