బీహార్‌లో అంతే : నీట్ ఎగ్జామ్‌లో 3 సెంటర్లలో 9 మంది డూప్లికేట్ స్టూడెంట్స్ పట్టివేత

బీహార్‌లో అంతే : నీట్ ఎగ్జామ్‌లో 3 సెంటర్లలో 9 మంది డూప్లికేట్  స్టూడెంట్స్ పట్టివేత

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ లో దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలోనే.. నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రీ ఎగ్జామ్ లోనూ పెద్ద ఎత్తున డూప్లికేట్ అభ్యర్థుల బండారం బయటపడింది. బీహార్ రాష్ట్రం కేంద్రంగా ఈ ముఠా చెలరేగినట్లు వార్తలు వస్తున్నాయి.

2026, జూన్ 21వ తేదీన బీహార్ రాష్ట్రంలోనూ నీట్ రీ ఎగ్జామ్ జరిగింది. ప్రతి సెంటర్ ను అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే మూడు సెంటర్లలో.. అసలైన అభ్యర్థుల స్థానంలో నకిలీ.. డూప్లికేట్ అభ్యర్థులు తొమ్మిది మంది పట్టుబడటం సంచలనంగా మారింది. కేఆర్కే హైస్కూల్ సెంటర్ లో ఒకరు, కేంద్రీయ విద్యాలయం సెంటర్ లో ఏడుగురు, హసన్ పూర్ పాఠశాల సెంటరన్ లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు స్క్వాడ్ అధికారులు. ఈ తొమ్మిది మంది అసలైన అభ్యర్థుల స్థానంలో.. డూప్లికేట్ గా వచ్చిన నీట్ ఎగ్జామ్ రాస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ విషయం బయటకు రాగానే బీహార్ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 

ఆదివారం జరిగిన నీట్ రీ-ఎగ్జామ్‌లో భారీ మోసం వెలుగుచూసింది. పటిష్ట భద్రత, బయోమెట్రిక్ తనిఖీలు ఉన్నప్పటికీ.. అభ్యర్థుల స్థానంలో ఇతరులతో పరీక్ష రాయించేందుకు ప్రయత్నించిన 9 మంది నకిలీ అభ్యర్థులతో సహా మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో కేంద్రీయ విద్యాలయ నుంచి 7 మంది, కేఆర్‌కే హైస్కూల్, హసన్‌పూర్ స్కూళ్ల నుంచి ఒక్కొక్కరు పట్టుబడ్డారు. వీరంతా వేర్వేరు జిల్లాలకు చెందిన సాల్వర్ గ్యాంగ్ సభ్యులుగా గుర్తించారు. ఈ పరీక్ష మోసంతో సంబంధం ఉన్న మరో 21 మంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీహార్ కేంద్రంగా నీట్ ఎగ్జామ్ సెంటర్లలో డూప్లికేట్ అభ్యర్థుల బండారం బయటపడటం.. ఈ ముఠా కింద 30 మంది అరెస్ట్ కావటంపై బీహార్ ప్రభుత్వం షాక్ అయ్యింది. ప్రభాకర్ కుమార్, శివం కుమార్ అనే ఇద్దరు ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. పట్టుబడిన ముఠాపై చర్యల కోసం.. స్పెషల్ పోలీస్ టీంను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ ముఠా ఒక్క బీహార్ రాష్ట్రానికే పరిమితం అయ్యిందా లేక ఇతర రాష్ట్రాల్లోనూ వీళ్ల నెట్ వర్క్ ఉందా అనే విషయాలపై దృష్టి పెట్టారు అధికారులు.

ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు గుట్టును హాజీపూర్ పీఎంసీహెచ్ విద్యార్థి మయాంక్ బయటపెట్టాడు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ సంస్థ సిబ్బందితో చేతులు కలిపిన మయాంక్.. తానే ఆ సంస్థ ఉద్యోగిగా నటిస్తూ ఎగ్జామ్ సెంటర్‌లోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. పోలీసులు అతడిని విచారించడంతో బయోమెట్రిక్ కంపెనీలోని మరికొందరు ఉద్యోగుల లింకులు బయటపడ్డాయి. పరీక్షను అడ్డుపెట్టుకుని కొందరు మొబైల్ ఫోన్లు స్మగ్లింగ్ చేయడానికి, ఇతరుల పేరుతో పరీక్షలు రాయించడానికి ప్రయత్నించారని, అయితే సీసీటీవీలు, కఠిన తనిఖీల ద్వారా వారిని పట్టుకున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ అభిషేక్ సింగ్ వెల్లడించారు.

నీట్ రీఎగ్జామ్ పరీక్ష పేపర్ టెలిగ్రామ్‌లో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో తీవ్ర కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ దీనిని తీవ్రంగా ఖండించాయి. అది ముమ్మాటికీ "ఫేక్ వీడియో" అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్-చెక్ యూనిట్ స్పష్టం చేసింది. పేపర్ లీక్ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. కొన్ని చోట్ల ఇలాంటి అక్రమాలకు ప్రయత్నించినప్పటికీ.. దేశవ్యాప్తంగా 5వేల440 కేంద్రాల్లో 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ నీట్ రీ-టెస్ట్‌కు హాజరయ్యారు.