నా పార్టీకి ఓటు వేయక పోయారో నిధులు ఆపేస్తా: ఓటర్లకు డిప్యూటీ CM అజిత్ పవార్ డైరెక్ట్ వార్నింగ్

నా పార్టీకి ఓటు వేయక పోయారో నిధులు ఆపేస్తా: ఓటర్లకు డిప్యూటీ CM అజిత్ పవార్ డైరెక్ట్ వార్నింగ్

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఓటర్లను బెదిరించారు. నా పార్టీకి ఓటు వేయకపోయారో నిధులు ఆపేస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం (నవంబర్ 23) పూణే జిల్లా బారామతిలోని మాలేగావ్ పట్టణంలో నిర్వహించిన ఎలక్షన్ క్యాంపెయినింగ్‎లో అజిత్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే నిధుల కొరత లేకుండా చూస్తా.. కానీ మీరు ఎన్సీపీ క్యాండిడేట్లను తిరస్కరిస్తే నేను కూడా మిమ్మిల్ని తిరస్కరిస్తా. మీ దగ్గర ఓట్లు ఉన్నాయి.. నా దగ్గర నిధులు ఉన్నాయి’ అని ఓటర్లను బెదిరించారు. 

ప్రజలు ఎన్సీపీపై నమ్మకం ఉంచితే, పార్టీ దానిని ఎప్పటికీ వృధాగా పోనివ్వదని అన్నారు. బారామతిని అభివృద్ధి చేసినట్లే మాలేగావ్‌ను కూడా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. తమకు ఓట్లు వేస్తేనే నిధులు ఇస్తామని అజిత్ పవర్ ఓటర్లను బెదరించడం రాజకీయ వివాదానికి దారితీసింది. ఓటర్లను బయపెట్టిన అజిత్ పవార్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నిధులు అజిత్ పవార్ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని.. సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఇస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. అజిత్ పవార్ బహిరంగంగా ఓటర్లను బెదిరిస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

 ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ అజిత్ పవార్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ఎవరినీ బెదిరించలేదని.. ప్రజలు మా అభ్యర్థులను గెలిపిస్తే నిధులు విడుదల చేసి అభివృద్ధిని ప్రోత్సహిస్తానని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్లు అడుగుతూ వాగ్దానాలు చేస్తారని.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన- బీహార్‌లో కూడా ఇది జరగడం మనం చూశామన్నారు. కాగా, 2025, డిసెంబర్ 2న మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ కలిసి మాలేగావ్‌లో పోటీ చేస్తున్నాయి.