
ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ వేదికగా జూలై 23 (గురువారం) జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు గాయాల సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల గాయాలు భారత జట్టును ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుమ్రా నాలుగో టెస్ట్ ఆడతాడో ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ కూడా గాయాలతో బాధపడుతున్నారు. ఆదివారం జిమ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో నితీశ్ రెడ్డి మోకాలికి గాయం అయింది. స్కానింగ్‌లో లిగమెంట్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా నాలుగో టెస్టుకు ముందు భారత ఫాస్ట్ బౌలింగ్ దళం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గజ్జల్లో నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆకాశ్ మ్యాచ్ టైమ్‌కు తను కోలుకుంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మ్యాచ్ సమయానికి ఆకాష్ దీప్ పూర్తి ఫిట్ గా ఉండడం కష్టంగానే కనిపిస్తుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో అవకాశం రాని లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ చేతికి తీవ్ర గాయమైంది. బౌలింగ్ చేసే ఎడమ చేతికే దెబ్బ తగలడంతో నాలుగో టెస్టుకు తను అందుబాటులో ఉండే చాన్స్ లేదు. పని భారం కారణంగా మూడు టెస్టులో ఆడతానని చెప్పిన బుమ్రా నాలుగో టెస్ట్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. నాలుగో టెస్టుకు టీమిండియా బౌలింగ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..
ALSO READ : టీ20 ట్రై-సిరీస్‌లో ఫైనల్కు చేరిన సౌతాఫ్రికా
శార్దూల్, ప్రసిద్ లకు ఛాన్స్:
మాంచెస్టర్ టెస్టులో సిరాజ్ ఆడడం కన్ఫర్మ్ అయిపోయింది. సిరాజ్ తో పాటు ప్రసిద్ కృష్ణ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఫాస్ట్ బౌలర్లు గాయపడడంతో బుమ్రా నాలుగో టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నితీష్ రెడ్డికి గాయం కావడంతో ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ కు అవకాశం దక్కొచ్చు. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ మాంచెస్టర్ టెస్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాషింగ్ టన్ సుందర్, జడేజా స్పిన్ ఆల్ రౌండర్లుగా కొనసాగనున్నారు.