కేసీఆర్ పరిపాలకుడు కాదు.. విధ్వంసకారుడు : ఆకునూరి మురళి

కేసీఆర్ పరిపాలకుడు కాదు.. విధ్వంసకారుడు : ఆకునూరి మురళి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలకుడు కాదు.. విధ్వంసకారుడు అని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. కేసీఆర్ పాలన అయిపోయిందని వదిలిపెట్టవద్దన్నారు. అయినా ఎలా వదిలిపెడతాం..? అని కామెంట్స్ చేశారు. రెవెన్యూ, ఆర్థిక, విద్య,TSPSC, గ్రామ పరిపాలనతో పాటు అన్నింటినీ విధ్వంసం చేశారని ఆరోపించారు. నూతన కలెక్టర్లను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా కేసీఆర్ మార్చారని చెప్పారు. ఎవరు ఎక్కువ కరప్షన్ చేస్తే వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ లో వేశాడని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల కంటె ఎక్కువ వనరులు ఉన్న దేశం  భారతదేశం అని చెప్పారు.  

కేసీఆర్.. రాష్ట్రాన్ని అనేక విధాలుగా దోచుకున్నారని ఆరోపించారు ఆకునూరి మురళి. కేసీఆర్ రాజకీయం, అవినీతి చేశాడు అని అన్నారు. ఇప్పుడు కొత్త దొంగలు రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. పాత దొంగలు కొన్ని నేర్పి వెళ్లారని, వాళ్లలాంటి వారి నుంచి తెలంగాణను కాపాడుకోవాలని కోరారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క శాఖలో అవినీతి లేకుండా లేదన్నారు. 

‘‘రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ అవినీతి పరుడే.. నేను కాదు అనను.. ఆయన ఎప్పుడో బీహార్ వెళ్లాడు.. కేసీఆర్ కి పరిపాలన అంటే చిరాకు.. కనీసం 90 వేల ఫైళ్లు చూడకుండా వెనక్కి పంపేవాడు’’ అని కామెంట్స్ చేశారు. రెవెన్యూశాఖ బలోపేతం కోసం ఒక కమిటీ వేయాలని కోరారు. 

హైదరాబాద్ బేగంపేట ది హరిత ప్లాజాలో తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కోదండరాం, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి హాజరయ్యారు.