ఆ ఊర్లో ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ బాధితులే...మేకలకుంట హామ్లెట్‌‌‌‌ జంపాలనగర్‌‌‌‌లో ఆందోళనకర పరిస్థితి

ఆ ఊర్లో ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ బాధితులే...మేకలకుంట హామ్లెట్‌‌‌‌ జంపాలనగర్‌‌‌‌లో ఆందోళనకర పరిస్థితి
  •     మూడేళ్లలో డయాలసిస్‌‌‌‌ చేయించుకుంటూ 10 మంది మృతి
  •     ఊరిలో 60కి పైగా కుటుంబాలు

ఖమ్మం/కొణిజర్ల, వెలుగు:  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకలకుంట పంచాయతీ పరిధిలోని జంపాలనగర్‌‌‌‌ గిరిజన గ్రామంలో కిడ్నీ వ్యాధులు గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. గ్రామంలో 60కి పైగా కుటుంబాలు ఉండగా..  ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. బాధితులు తరచూ ఖమ్మం, హైదరాబాద్‌‌‌‌లోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు డయాలసిస్‌‌‌‌ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్లలో కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో 10 మందికి పైగా మృతి చెందడంతో   భయాందోళనలు నెలకొన్నాయి. 

కలుషిత నీరే కారణమా?

జంపాలనగర్‌‌‌‌లో కిడ్నీ సమస్యలకు కలుషిత నీరే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం మిషన్‌‌‌‌ భగీరథ   పనుల్లో భాగంగా వాటర్‌‌‌‌ ట్యాంకు నిర్మించి, ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. అయితే ట్యాంకు నుంచి వచ్చే నీరు తరచూ బురదగా వస్తుండటంతో గ్రామస్తులు ఆ నీటిని వినియోగించడం మానేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న ఒక బోరు, ఒక చేతి పంపు నీరే తాగునీటికి ఆధారంగా మారాయి. ఇటీవల కిడ్నీ బాధితుల సంఖ్య పెరగడంతో కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి ఆటోల్లో మినరల్‌‌‌‌ వాటర్‌‌‌‌ క్యాన్లు తెప్పించుకుని వాడుతున్నాయి. అయినప్పటికీ చాలా కాలంగా కలుషిత గుంట సమీపంలోని బోరు నీటినే తాగుతుండటంతో అదే సమస్యలకు కారణమై ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.

బాధితులు వీరే..

గ్రామానికి చెందిన లావుడియా లాలు (41) గత నెల 21న కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు. గత మూడేళ్లుగా ఖమ్మంలో చికిత్స  పొందిన ఆయన రెండు, మూడు నెలలుగా డయాలసిస్‌‌‌‌ చేయించుకున్నాడు. గత నెలలో తీవ్ర జ్వరం రావడంతో చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్తుండగానే మార్గమధ్యంలో మరణించాడు. గత మూడేళ్లలో లావుడియా బిచ్చ, భుక్యా మంగిత్యా, ధరావత్‌‌‌‌ దేవులు, బానోత్‌‌‌‌ ముని, బాదావత్‌‌‌‌ దేవి, గుగులోత్‌‌‌‌ లాలు, గుగులోత్‌‌‌‌ అచ్చు, బానోత్‌‌‌‌ సర్వణ్‌‌‌‌ తదితరులు కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

ప్రస్తుతం మాలోత్‌‌‌‌ కోటమ్మ, ధరావత్‌‌‌‌ హస్లీ, గుగులోత్‌‌‌‌ మాన్‌‌‌‌సింగ్‌‌‌‌, లావుడియా చిలక, గుగులోత్‌‌‌‌ రుక్కి తదితరులు కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. మరికొందరు కూడా వివిధ ఆస్పత్రుల్లో వైద్యం తీసుకుంటున్నారు. పూర్తిగా వ్యవసాయం, వ్యవసాయ కూలి పనులపై ఆధారపడే కుటుంబాలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ పరీక్షలు, చికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఊరందరికీ రక్త పరీక్షలు చేయాలి 

గ్రామంలో రెండు, మూడేళ్లుగా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోంది. బోరు నీళ్ల వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయనే అనుమానంతో మినరల్‌‌‌‌ వాటర్‌‌‌‌ క్యాన్లు కూడా తెప్పించుకుంటున్నాం. మిషన్‌‌‌‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు అందేలా పైప్‌‌‌‌లైన్లను మరమ్మతు చేయాలి. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, బాధితులకు ఉచిత వైద్య సాయం అందించాలి. కిడ్నీ వ్యాధులతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. 

– ధరావత్‌‌‌‌ మాన్‌‌‌‌సింగ్‌‌‌‌, జంపాలనగర్