బాసర గోదావరిలో కాలుష్య భూతం

బాసర గోదావరిలో కాలుష్య భూతం
  • ఏడాది పాటు నిల్వ ఉంచిన వేస్టేజీ రిలీజ్ చేసిన కంపెనీ
  • చేపలు చనిపోతున్నాయంటూ మత్స్యకారుల ఆందోళన
  • పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు

భైంసా, వెలుగు: చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో గోదావరి నది కాలుష్య భూతం గుప్పిట చిక్కుకున్నది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భారీగా వ్యర్థాలు నదిలో కలిసిపోయాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని ‘పయనీర్​ డిస్టిలరీ లిమిటెడ్’ ఆల్కహాల్ ఫ్యాక్టరీలో ఏడాది పాటు నిల్వ ఉంచిన ప్రమాదకర రసాయనాలను అక్కడి నిర్వాహకులు ప్రత్యేక కాలువ ద్వారా ఆదివారం విడుదల చేశారు. 5 కిలోమీటర్ల పొడవున ఈ వ్యర్థాలు పారి నదిలో కలిశాయి. దీంతో నీళ్లు నలుపు రంగులోకి మారి నురగలు కక్కుతున్నాయి. ఉదయం వేళ నది వైపు వెళ్లినవారు మారిన రంగును చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ గోదావరి నదికి ముప్పు పొంచి ఉందని గత నెల 26నే ‘వీ6 వెలుగు’ హెచ్చరించింది. ‘గోదావరిలోకి మహా వ్యర్థాలు’ శీర్షికన వార్త  కూడా ప్రచురించింది. అయినా బాసర ఆలయ అధికారులు గానీ, పొల్యూషన్​ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు గానీ అటు వైపు కన్నెత్తి చూడలేదు. నది కలుషితం అవుతోందని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. ఆలయ అధికారులు సైతం పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డుకు ఫిర్యాదులు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత ఆఫీసర్లు ముందు చూపుతో వ్యవహరించి ఉంటే, ప్రమాదకర రసాయనాలు, వ్యర్థాలు నదిలో కలవకుండా ఉండేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

నదీ తీరాన కంపు
ఆల్కహాల్​ఫ్యాక్టరీ నుంచి విడుదలైన రసాయన వ్యర్థాలు బాసర గోదావరి నదిలో కలిసిపోయాయి. దీంతో నీళ్లు రంగు మారడంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన వస్తున్నది. బాసర నుంచి పంచగుడి మీదుగా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు వరకు నీరంతా కలుషితమైపోయింది. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు, నిజామాబాద్, భైంసా వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు నది ప్రాంతంలో ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. నిర్మల్, నిజామాబాద్  జిల్లాల పరిధిలో నది చుట్టుపక్కల ఉన్న సుమారు వందకు పైగా గ్రామాలు తాగునీటి కోసం గోదావరిపైనే ఆధారపడ్డాయి. ప్రస్తుతం కలుషితమైన నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నీటిని తాగితే రోగాల బారినపడే ప్రమాదం ఉంది. కొందరు భక్తులు నదిలో దుర్వాసన, నీళ్ల రంగును చూసి స్నానాలు చేయలేకపోయారు. నదిలోని చేపలు కూడా చనిపోతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది నీళ్లు కలుషితం కావడానికి కారణమైన ఆల్కహాల్ ​ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.