సాగర్​ను మందులో  ముంచుతున్నరు

సాగర్​ను మందులో  ముంచుతున్నరు
  • ఉప ఎన్నికతో ఏరులై పారుతున్న మద్యం 
  • '27 రోజుల్లో రూ.16.26 కోట్ల లిక్కర్​ సేల్స్  
  • నిరుటితో పోలిస్తే రూ.7.76 కోట్లు ఎక్కువ 
  • బీర్ల కంటే లిక్కర్ కే డిమాండ్ 

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు విందు భోజనాలు, దావత్ లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికార పార్టీ  గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత 22 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అధికార పార్టీ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మండల కేంద్రాల్లో మీటింగ్ లు పెడుతుండగా, గ్రామాల ఇన్ చార్జిలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ఒక దశ ప్రచారం కూడా పూర్తయిందని చెబుతున్నారు. క్యాంపెయిన్ లో భాగంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు విచ్చలవిడిగా మద్యం పంచుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8 నుంచి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకోగా, అప్పటి నుంచే మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.  

ఈ నెల 1 నుంచి 27 వరకు నియోజకవర్గంలోని త్రిపురారం, పెద్దవూర, నాగార్జునసాగర్, నిడమనూరు, తుమ్మడం, అనుమల, హాలియా ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరిగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ 27 రోజుల్లోనే రూ.16.26 కోట్ల మద్యం సేల్ అయింది. దీంట్లో లిక్కర్ 20,603 పెట్టెలు కాగా, బీర్లు 11,734 పెట్టెలు ఉన్నాయి. పోయినేడు లాక్ డౌన్ కారణంగా మార్చి 21 నుంచి షాపులు బంజేశారు. అప్పటి వరకు జరిగిన మద్యం అమ్మకాల విలువ రూ.8.54 కోట్లు మాత్రమే. కానీ ఈసారి బైపోల్ కావడంతో నియోజకవర్గంలోని అన్ని షాపుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడవుతోంది. దీంతో గతేడాదితో పోలిస్తే ఇప్పటికే అదనంగా రూ.7.76 కోట్ల సేల్స్ జరిగాయి. 
వారం రోజులుగా ఫుల్లు 
గత వారం రోజుల నుంచి నియోజకవర్గంలో మద్యం సేల్స్ గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా పెద్దవూర, నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ, నిడమనూరు, త్రిపురారం, నందికొండ, తుమ్మడం, అనుమల, హాలియా పరిధిలోని షాపుల్లో ఈ నెల 22న రూ.77.63 లక్షల సేల్స్ జరిగితే .. 23న రూ.66.10 లక్షలు, 24న రూ.1.38 కోట్లు, 25న రూ.1.57 కోట్లు, 26న రూ.75.98 లక్షలు, 27న రూ.1.57 కోట్ల సేల్స్ జరిగాయి. దీంట్లో లిక్కర్ 9,027 పెట్టెలు అమ్ము డు కాగా, బీర్లు కేవలం 3,254 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. కాగా, నియోజకవర్గంలో మొత్తం 18 షాపులు ఉండగా.. హోల్ సేల్ బిజినెస్ చేస్తున్న షాపులకే ఫుల్ గిరాకీ పెరిగింది. ఈ షాపుల కేంద్రంగానే బెల్టు షాపులకు మద్యం సప్లై అవుతోంది. ఆయా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి షాపులన్నీ సిండికేట్ గా మారి.. ఒకే షాపు నుంచి బెల్టుషాపులకు సరుకు సప్లై చేస్తూ హోల్ సేల్ దందా సాగిస్తుంటాయి. ఇప్పుడు ఉప ఎన్నికలు కావడంతో ఈ తరహా షాపులకు డిమాండ్ పెరిగింది. 18 షాపులకు గాను కేవలం ఆరు షాపుల్లోనే రికార్డు స్థాయిలో సేల్స్ జరుగుతున్నాయి. పెద్దవూర, త్రిపురారం, హాలియా, నందికొండ, గుర్రంపోడు, తుమ్మడం షాపుల నుంచే మద్యం భారీగా సేల్ అవుతోంది.
బీర్ల కంటే లిక్కరే ఎక్కువ 
నియోజకవర్గంలో బీర్లతో పోలిస్తే లిక్కర్ సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్క బీరు ఖరీదు రూ.150కిపైగా ఉండడంతో,  దానికి బదులు క్వార్టర్ సీసాలు పంపిణీ చేయడమే రాజకీయ పార్టీలకు సులభంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ నెలలో లిక్కర్ సీసాలు 7,057 పెట్టెలు ఎక్కువగా అమ్ముడు కాగా, బీర్లు 4,735 పెట్టెలు తగ్గాయి. అదే విధంగా మద్యం సేల్స్ లో ఆర్డినరీ, మీడియం బ్రాండ్ల కంటే ప్రీమియం బ్రాండ్లకే క్రేజ్ పెరిగింది. ఓటర్లను ఆకట్టు కునేందుకు రాజకీయ పార్టీలు రూ.వెయ్యి దాటిన మద్యాన్నే పంపిణీ చేస్తున్నాయి. సిగ్నేచర్, బ్లెండర్స్ ప్రైడ్ వంటి ప్రీమియం బ్రాండ్లే ఎక్కువగా సేల్ అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.