హైదరాబాద్: మేడారం మహా జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం (జనవరి 11) మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్కతో కలిసి మేడారం జాతర అభివృద్ధి పనులను భట్టి పరిశీలించారు. అనంతరం మేడారం జాతర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో మేడారం జాతర అభివృద్ధి పనులన్నీ పూర్తి అవుతాయని తెలిపారు. రూ.251 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని.. శాశ్వత నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
కాగా, దక్షిణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతర 2026, జనవరి 28 నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. మొత్తం నాలుగు రోజుల పాటు జాతర జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి 2026, జనవరి 20వ తేదీన మేడారం వెళ్లి వనదేవతలను దర్శించుకుని జాతర ప్రారంభించనున్నారు.
