న్యూఢిల్లీ: కరుడుగట్టిన ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ టెర్రర్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధించిన ఓ ఆడియో రికార్డ్ బయటపడింది. ఇండియాపై పీకలదాకా విషం నింపుకుని ఉండే మసూద్ ఎప్పటిలాగే ఈ ఆడియోలో భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏ క్షణంలోనైనా భారీ సంఖ్యలో భారత్‌పై ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉన్నామన్నాడు. ఒకరిద్దరూ కాదు.. ఇండియాపై దాడికి 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లు రెడీగా ఉన్నారని పేర్కొన్నాడు.
తన గ్రూపులోని సూసైడ్ బాంబర్ల సంఖ్యను బహిర్గతం చేస్తే ప్రపంచం షాక్‌కు గురి అవుతుందన్నాడు. ఈ వ్యక్తులు దాడులు చేసి వారి లక్ష్యాన్ని సాధించడానికి చాలా ప్రేరేపించబడ్డారనిపేర్కొన్నాడు. అయితే, ఈ ఆడియో రికార్డింగ్ ఎప్పుడు..? ఎక్కడ..? రికార్డ్ చేశారనే దానిపై క్లారిటీ లేదు. ఈ ఆడియో రికార్డ్ వైరల్ కావడంతో భారత నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆ ఆడియో క్లిప్‌పై ఆరా తీస్తున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో భద్రతను కట్టదిట్టం చేశారు.
2001 భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఎటాక్, 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడి వంటి అనేక ప్రధాన దాడుల మాస్టర్ మైండ్ మసూద్ అజార్. ఇప్పటికే భారత్ అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. 2019లో ఐక్యరాజ్యసమితి కూడా అజార్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది. భారత సైన్యం మసూద్‌ను అరెస్ట్ చేయగా..1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 హైజాక్ చేసి ఉగ్రవాదులు అతడిని విడిపించారు. ఆ తర్వాత జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థాపించి భారత్‌లో ఎన్నో దాడులకు కుట్రలు చేశాడు అజార్.
