ముషీరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం గ్రౌండ్‌లో ఆగస్టు 7న అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహించనున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్‌లో వివిధ బీసీ సంఘాల నేతలతో కలిసి మహాసభకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లా డారు. దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు విద్యా రంగంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం ఆగస్టు 7న ప్రకటించింది.
ఆ రోజును బీపీ మండల్ డేగా వ్యవహరిస్తూ ఏటా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి అఖిల భారత జాతీయ 8వ మహాసభ తిరుపతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమ బలోపేతానికి చేపట్టిన చర్యలను, భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా బీసీలకు బీపీ మండల్ చేసిన సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

