హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పొలిటికల్ టూరిజం నడుపుతున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలని, ప్రజలను వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్.. అసెంబ్లీకి రావడానికి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. గత 26 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీ గడప తొక్కకుండా జీతభత్యాల రూపంలో రూ.5 కోట్ల ప్రజాధనాన్ని తీసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపైనా, డ్రగ్స్ మాఫియాపైనా రేవంత్ విమర్శలు చేశారని, అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణకు కన్సెంట్ ఇవ్వాలని కిషన్ రెడ్డి చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యంతో డ్రగ్స్ మహమ్మారి ప్రతి గ్రామానికి పాకిందని ఆరోపించారు. ‘‘కేసీఆర్ రూ.4 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. మేము ఎందుకు సంపాదించుకోకూడదు అనే ధోరణిలో కాంగ్రెస్ నేతలు అవినీతికి తెరలేపారు” అని సుభాష్ వ్యాఖ్యానించారు.

