- కోటగిరి గుట్టపై అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు సన్నాహాలు
- రూ. పది కోట్లతో అభివృద్ధి
- ముమ్మరంగా సాగుతున్న మొదటివిడత పనులు
సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం కొత్త రూపు సంతరించుకోనుంది. చారిత్రక నేపథ్యంతో పాటు -ప్రకృతి సోయగాలకు ప్రతీకగా నిలిచిన కోటగిరి గుట్టలపై ‘అర్బన్ ఫారెస్ట్ పార్క్’ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. పక్షుల కిలకిలరావాలు, పచ్చని అటవీ ప్రాంతం, వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రాతి కోటలతో హుస్నాబాద్‌కు 5 కిలోమీటర్ల దూరంలో మహమ్మదాపూర్, ఉమ్మాపూర్, ఆకునూరు గ్రామాల మధ్య 350 హెక్టార్లు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ మొదటి దశ పనులకు శంకుస్థాపన చేశారు.
36 గుట్టలు 3,200 ఎకరాల ప్రకృతి సంపద...
మహమ్మదాపూర్, ఉమ్మాపూర్, ఆకునూరు గ్రామాల మధ్య విస్తరించిన ఈ అటవీ ప్రాంతంలో సుమారు 800 మీటర్ల ఎత్తులో విస్తరించిన 36 గుట్టలు పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల సరిహద్దుల్లోకోటగిరి గుట్టలు ఉండటంతో సందర్శకుల రాక పెరగనుంది. కోటగిరి గుట్టల్లోని 350 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు పగోడాలు, ఎత్తైన వాచ్ టవర్లు, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల పార్క్, రెండు గుట్టల మధ్య బ్రిడ్జ్, రాయికల్ జలపాతం వద్ద ట్రెక్కింగ్ స్పాట్ ఏర్పాటు చేయనున్నారు.
అదనంగా ఉద్యానవనాలు, గడ్డి మైదానాలు ఏర్పాటు చేసి పర్యాటకులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా లక్నవరం చెరువు తరహాలో కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి దశలో రూ.3 కోట్లు శాంక్షన్ చేశారు. పనులు వేగంగా కొనసాగుతుండగా ‘అర్బన్ లంగ్ స్పేస్’ కాన్సెప్ట్ తో ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేస్తున్నారు.
ఈ ఏడాది రూ.3కోట్లు, వచ్చే రెండో ఏడాది రూ.3.85 కోట్లు, మూడో ఏడాదిలో రూ.2.87 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. నేటి యువత అడ్వంచర్ స్పోర్ట్స్ కు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కోటగిరి గుట్టల్లో అడ్వంచర్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. రాయికల్ వాటర్ ఫాల్స్ వద్ద ట్రెక్కింగ్, గుట్టల మధ్య బోటింగ్, స్పీడ్ బోట్, ఓపెన్ జిమ్ తో పాటు సాహస క్రీడలు, పిల్లల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.
పరిశోధనలకు కేంద్రం.. చరిత్రకు కొత్త ఊపిరి
కోటగిరి గుట్టల్లో ఏర్పాటు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ వినోదంతో పాటు విద్య, పరిశోధనలకు వేదికగా నిలవనుంది. అటవీ, ఉద్యాన, వ్యవసాయ విద్యార్థుల కోసం ప్రత్యేక రీసెర్చ్ సెంటర్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. సోలార్ లైటింగ్, చెక్ డ్యాంను పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తున్నారు. చాళుక్యుల కాలం నాటి కోట అవశేషాలు, సర్వాయి పాపన్నకు చెందిన చారిత్రక గుర్తులు ఉన్న ఈ ప్రాంతం, ఈ ప్రాజెక్ట్ తో మరింత ప్రాచుర్యంలోకి రానుంది. 33 హెక్టార్లలో ‘విజిటర్స్ జోన్’, 315 హెక్టార్లలో ‘కన్జర్వేషన్ జోన్’ ఏర్పాటు చేసి ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తాం
కోటగిరి గుట్టల్లో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను వచ్చే రెండేళ్ల లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను వేగంగా జరిపిస్తున్నాం. మొదటి దశలో వాచ్ టవర్లు, పగోడాల నిర్మాణం ప్రారంభించాం. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. అటవీ భూముల రక్షణతో పాటు వన్యప్రాణులకు కూడా భద్రత కలుగుతుంది.”
-సిద్ధార్థ రెడ్డి, ఎఫ్‌ఆర్‌వో, హుస్నాబాద్

