V6 News

అద్రక్ కే పంజే నాటక సృష్టికర్త బబ్బన్ ఖాన్ కన్నుమూత

అద్రక్ కే పంజే నాటక సృష్టికర్త బబ్బన్ ఖాన్ కన్నుమూత

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ థియేటర్ ఆర్టి స్ట్, 'అద్రక్ కే పంజే' నాటక సృష్టికర్త బబ్బన్ ఖాన్ (83) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన రాసి, కీలక పాత్ర పోషించిన హాస్య నాటకం 'అద్రక్ కే పంజే' ప్రపంచవ్యాప్తం గా పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‎లో చోటు సంపాదించుకోవడం విశేషం.

 తన 22 ఏళ్ల వయసులో పాతబస్తీలోని వీధి దీపాల కింద బబ్బన్ ఖాన్ ఈ నాటకాన్ని రాశారు. 1965లో తొలి ప్రదర్శన జరిగిన ఈ నాటకం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కుటుంబ నియంత్రణ అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని, 'రామూ' అనే క్లర్క్ పాత్ర ద్వారా ఆయన పండించిన హాస్యం, సింగిల్ లైనర్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విం చాయి. 60కి పైగా దేశాల్లో, డజన్ల కొద్దీ భాషల్లో పదివేలకు మించి ప్రదర్శనలు జరిగాయి. 

ఇందిరాగాంధీ లాంటి నేషనల్ లీడర్స్ తో పాటు దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి దిగ్గజ నటులను ఈ నాటకం నవ్వించింది. క్వీన్ ఎలిజిబెత్ సహా ఫ్రాన్సిస్ పోర్ట్ కప్పోలా లాంటి హాలీవుడ్ డైరెక్టర్ దీన్ని ఎంజాయ్ చేశారు. షేక్ స్పియర్ నాటకాలతో పోటీపడి లండన్ లో వేల ప్రదర్శనలు ఇచ్చారు. మన దేశంలో మాత్రం తక్కువసార్లు ప్రదర్శింప బడింది.

 తొలి ప్రదర్శన జరిగిన రవీంద్రభారతిలో 2001లో చివరగా ప్రదర్శించారు. సామాజిక సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పడంతో పాటు హైదరాబాదీ ఉర్దూతో కూడిన దక్కనీ యాస ఒకప్పటి హైదరాబాద్ సంస్కృతికి అద్దం పట్టింది. కేవలం నాటకకర్తగానే కాకుండా, తన ఇంటినే శిక్షణ కేంద్రంగా మార్చి ఎందరో నూతన నటీనటులకు బబ్బన్ ఖాన్ శిక్షణ ఇచ్చారు. 

ఆయన మృతి పట్ల ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 'అద్రక్ కే పంజే' రూపంలో ఆయన ఎప్ప టికీ చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. శనివారం జరిగిన అంత్యక్రియలకు వందలాది మంది నాటక ప్రేమికులు, అభిమానులు హాజరయ్యారు.