మద్దతు ధర పంటలన్నీ 100 శాతం కొనాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మద్దతు ధర పంటలన్నీ 100 శాతం కొనాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించడంతో ప్రభుత్వాల బాధ్యత పూర్తికాదని, ఆ ధర ప్రతి రైతుకూ అందేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సెక్రటేరియెట్​లో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి మార్కెటింగ్‌‌‌‌ సీజన్‌‌‌‌ 2027–28కు సంబంధించి కేంద్ర కేబినెట్ ప్రకటించిన వివిధ పంటల మద్దతు ధరల పెంపును ఆయన సమీక్షించారు.

కుసుమకు క్వింటాల్‌‌‌‌కు రూ.675, ఆవాలకు రూ.413, మసూర్‌‌‌‌కు రూ.390, బార్లీకి రూ.136, శెనగకు రూ.83, గోధుమకు రూ.25 చొప్పున ఎంఎస్‌‌‌‌పీ పెంచినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం పీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ కింద ఆయా రాష్ట్రాల్లో సాగయ్యే పప్పుధాన్యాలు, నూనెగింజల మొత్తం ఉత్పత్తిలో నాఫెడ్‌‌‌‌ ద్వారా కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుత ఎల్‌‌‌‌నినో పరిస్థితులు, ఊహించని వాతావరణ మార్పుల నేపథ్యంలో కేంద్రం మద్దతు ధర ప్రకటించిన అన్ని రకాల పంటలను వంద శాతం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరారు.

కరువు మండలాల గుర్తింపుపై సమాచార సేకరణ

రాష్ట్రంలో కరువు మండలాల సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ప్రతి మండలాన్ని ఒక యూనిట్‌‌‌‌గా తీసుకుని రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని అంచనా వేయాలన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. కేవలం వర్షపాతం లోటును మాత్రమే కాకుండా, పలు అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.

వర్షపాతం వ్యత్యాసం, ఎస్‌‌‌‌పీఐ (ఎస్పీఐ), పొడి కాలం, విత్తిన విస్తీర్ణం, ఎన్‌‌‌‌డీవీఐ, నేల తేమ, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, భూగర్భ జల పరిస్థితులు, పశుగ్రాసం, తాగునీటి లభ్యత, వలసలు వంటి బహుళ సూచికలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కరువు తీవ్రతను బట్టి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పంట నష్టాన్ని నిర్ధారించాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ ఎండీ రాహుల్‌‌‌‌ రాజ్‌‌‌‌, హార్టికల్చర్‌‌‌‌ ఎండీ యాస్మిన్‌‌‌‌ బాషా పాల్గొన్నారు.