- పార్లమెంట్ సెషన్లో చర్చకు సహకరించాలని కోరిన కేంద్రం
- రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెట్టాలని ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చే విషయాన్ని కూడా ప్రతిపక్షాలు చర్చకు తీసుకొచ్చారు. అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకుందామని, సభకు సహకరించాలని ప్రతిపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తామని సూచించింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున డిఫెన్స్ మినిస్టర్, లోక్‌సభ డిప్యూటీ లీడర్ రాజ్‌నాథ్ సింగ్, లీడర్ ఆఫ్ రాజ్యసభ, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్‌లో అల్లర్లు, సామాజిక అసమానతల అంశంపై సభ్యులు చర్చించారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి.. ఈ సెషన్లోనే ఆమోదింపజేయాలంటూ బీజేడీ, బీఆర్ఎస్తో పాటు పలు పార్టీలు కేంద్రాన్ని కోరాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చొద్దని డిమాండ్ చేశాయి.
ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాయి. అదేవిధంగా, పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఎజెండా అంశాలపై కూడా కేంద్రంతో ఆల్ పార్టీ లీడర్లు చర్చించారు. ఆల్ పార్టీ మీటింగ్‌కు కాంగ్రెస్ నుంచి అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) నుంచి హెచ్డీ దేవేగౌడ, డీఎంకే నుంచి కనిమొళి, టీడీపీ నుంచి రామ్ మోహన్ నాయుడు, టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సంజయ్ సింగ్, బీజేడీ నుంచి సస్మిత్ పాత్ర, బీఆర్ఎస్ తరఫున కే.కేశవ్ రావు, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, సమాజ్‌వాది పార్టీ నుంచి గోపాల్ యాదవ్, వైఎస్సార్సీపీ తరఫున విజయ సాయి రెడ్డి, తో పాటు మరికొన్ని పార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరయ్యారు.