అంబర్పేట్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ.వంద కోట్లు విడుదల చేయడం స్వాగతించదగ్గ విషయమని, కానీ అది సమస్య పరిష్కారానికి తొలి అడుగు మాత్రమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. మిగిలిన బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆదివారం అంబర్పేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రీయింబర్స్‌మెంట్ బకాయిల జాప్యం కారణంగా విద్యార్థులు కాలేజీల్లో సర్టిఫికెట్లు పొందలేకపోవడం, తదుపరి విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
