
- జైక్వాడీ నుంచి ధవళేశ్వరం దాకా ఖుల్లా
- 1986 తర్వాత ఇదే మొదటిసారి
- అన్ని ఉప నదుల్లోనూ భారీ వరద
హైదరాబాద్, వెలుగు : గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తారు. మహారాష్ట్రలోని జైక్వాడీ ప్రాజెక్టు నుంచి ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేశారు. జైక్వాడీ, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, మేడిగడ్డ, తుపాకులగూడెం (సమ్మక్క సాగర్), దుమ్ముగూడెం (సీతమ్మ సాగర్) బ్యారేజీలు, పోలవరం, ధవళేశ్వరం వరకు అన్నింటి గేట్లు ఎత్తారు. ఇలా ఒకేసారి అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం చాలా అరుదని ఇంజనీర్లు అంటున్నారు. సాధారణంగా జైక్వాడీ, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నుంచి వరుసపెట్టి వాటి దిగువ ప్రాజెక్టుల గేట్లు ఎత్తినప్పుడు... సింగూరు, నిజాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన సందర్భాలు అరుదేనని చెబుతున్నారు. ఒకవేళ దిగువ గోదావరి పోటెత్తినా ఎగువన ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడం చాలాసార్లు చూశామని.. ఈసారి గోదావరితో పాటు దాని ఉప నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, వాటిపై నిర్మించిన మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఓవర్ ఫ్లో అవుతున్నాయని తెలిపారు. 1986 తర్వాత జులైలోనే గోదావరి బేసిన్‌లో ఇంతటి భారీ వరదలు రావడం ఇదే మొదటిసారి అని, అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.
మైనర్ ప్రాజెక్టులు ఓవర్ ఫ్లో..
గోదావరి బేసిన్‌లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్ చేశారు. సంగారెడ్డిలోని నల్లవాగు, మెదక్ లోని ఘన్‌పూర్ ఆనికట్, నిజామాబాద్ లోని రామడుగు, కామారెడ్డిలోని పోచారం, కౌలాస్ నాలా, ఆదిలాబాద్ లోని సాత్నాల, మత్తడి వాగు, నిర్మల్ లోని స్వర్ణ, గడ్డెన్న వాగు, ఆసిఫాబాద్ లోని వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, కొమ్రంభీం ప్రాజెక్టు, జగన్నాథపూర్ ప్రాజెక్టు, మంచిర్యాలలోని గొల్లవాగు, నీల్వాయి, ర్యాలీవాగు, సిద్దిపేటలోని శనిగరం, భూపాలపల్లిలోని బొగ్గుల వాగు, మల్లూరు వాగు, గుండ్లవాగు, ములుగులోని లక్నవరం, రామప్ప, పాలెంవాగు, సిరిసిల్లలోని అప్పర్ మానేరు, కొత్తగూడెంలోని పెద్దవాగు, తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులన్నీ నిండి ఓవర్ ఫ్లో అవుతున్నాయి. తాలిపేరు నుంచి అత్యధికంగా 35 వేల క్యూసెక్కులకు పైగా నీళ్లు కిందికి వదులుతున్నారు.
కృష్ణాలో రెండే..
కృష్ణా బేసిన్‌లో తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లు మాత్రమే ఓపెన్ చేశారు. మైనర్ ఇరిగేషన్‌లో సూర్యాపేట జిల్లాలోని మూసీ, వికారాబాద్ లోని కోటపల్లి వాగు, ఖమ్మంలోని వైరా, లంకసాగర్, మహబూబాబాద్ లోని బయ్యారం ట్యాంక్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.