కుండపోత వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద

కుండపోత వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద

 

  •  ఒక్కరోజులోనే సముద్రంలోకి 110 టీఎంసీలు
  •     మేడిగడ్డకు 17 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో
  •     భద్రాచలం వద్ద 54.70 అడుగుల నీటిమట్టం
  •     ఎగువ నుంచి ఐదు రోజుల్లో 60  టీఎంసీలు

హైదరాబాద్‌‌ / నిజామాబాద్​, వెలుగు : గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్‌‌ చేశారు. శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు నుంచి మొదలుకొని ఏపీలోని ధవళేశ్వరం వరకు ప్రాజెక్టులు, బ్యారేజీల గేట్లు తెరిచి పెద్ద ఎత్తున నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరితో పాటు దాని ఉపనదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మంగళవారం ఒక్కరోజే 110 టీఎంసీల నీళ్లు బంగాళాఖాతంలో చేరాయి. మహారాష్ట్రలోని నాసిక్‌‌ - త్రయంబకేశ్వర్‌‌లో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతోంది. గైక్వాడ్‌‌ ప్రాజెక్టు గేట్లు గురువారం ఎత్తే అవకాశముంది. 



అక్కడి నుంచి 400 కి.మీ.ల దూరంలోని ఎస్సారెస్పీకి 3రోజుల్లో వరద చేరుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. మంగళవారం ఎస్సారెస్పీ ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులకు తగ్గగా బుధవారం 4 లక్షల క్యూసెక్కులకు పైగా పెరిగింది. ఎగువ నుంచి ప్రవాహం ఇంకా పెరుగుతోంది. గైక్వాడ్‌ గేట్లు కూడా ఎత్తితే శని, ఆదివారం వరకు ఇన్ ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతం నుంచి  భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 5రోజుల్లో 60 టీఎంసీల నీరు వచ్చింది. 8న ప్రాజెక్ట్​లో 32 టీఎంసీలు ఉండగా భారీగా వరద వస్తుండడంతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఎస్పారెస్పీ నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 76 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం1091 అడుగులు కాగా, 1087 అడుగులు కొనసాగిస్తున్నారు. ఐదు రోజు ల్లో 16 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 4 లక్షల 18 వేల 960 క్యూసెక్కుల వరద వస్తుండగా, 34 గేట్ల ద్వారా 4 లక్షల 15 వేల క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. ఎల్లంపల్లికి రికార్డు స్థాయిలో 12 లక్షల క్యూసెక్కులు, సుందిళ్ల బ్యారేజీకి 11.95 లక్షలు, అన్నారం బ్యారేజీకి 12.43 లక్షలు, మేడిగడ్డకు 17.12 లక్షలు, సమ్మక్క సాగర్‌కు 17.65 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 54.70 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. గురువారం మధ్యాహ్నానికి ఇక్కడ నీటిమట్టం 60 అడుగులకు పైగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మిడ్‌ మానేరు ప్రాజెక్టుకు అప్పర్‌ మానేరు, ఎస్సారెస్పీ నుంచి 52 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. సింగూరుకు 9 వేలకు పైగా, నిజాంసాగర్‌కు 20 వేల క్యూసెక్కుల పైగా మంజీరా నుంచి వచ్చి వరద ప్రవాహం చేరు తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌, తుంగభద్ర ప్రాజెక్టుల గేట్లు ఇప్పటికే ఎత్తగా మంగళవారం మన రాష్ట్రంలోని జూరాల గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని వదిలేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులకు పైగా ఉండగా, తుంగభద్ర, జూరాల నుంచి గురువారం ఉదయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశముంది.