ఈడీ సీజ్ చేసిన డబ్బంతా పేదలకే పంచుతం : మోదీ

ఈడీ సీజ్ చేసిన డబ్బంతా పేదలకే పంచుతం : మోదీ
  •  బెంగాల్‌‌లో అవినీతి సొమ్ము రూ.3 వేల కోట్లు 
  •  కృష్ణానగర్ ఎంపీ అభ్యర్థి అమృతా రాయ్‌‌తో ఫోన్ సంభాషణ

కోల్‌‌కతా: బెంగాల్‌‌లో అవినీతిపరుల నుంచి ఈడీ సీజ్ చేసిన రూ.3వేల కోట్లను ఆ రాష్ట్రంలోని పేద ప్రజలకే పంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అందుకోసం చట్టపరమైన అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ బెంగాల్‌‌లోని బీజేపీ ఎంపీ అభ్యర్థులకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ప్రచారంపై ఆరా తీస్తున్నారు. 

మంగళవారం బసిర్ హట్ బీజేపీ అభ్యర్థి రేఖ పత్రతో మాట్లాడిన మోదీ.. బుధవారం కృష్ణానగర్ అభ్యర్థి రాజమాత అమృతా రాయ్‌‌తో మాట్లాడారు. "బెంగాల్‌‌లోని పేద ప్రజల నుంచి అవినీతిపరులు రూ. 3 వేల కోట్లను దోచుకున్నారు. ఈ 3 వేల కోట్లను ఇప్పటికే ఈడీ జప్తుచేసింది. ఆ సొమ్మును మళ్లీ పేద ప్రజలకే పంచుతం. అవసరమైతే చట్టపరమైన అవకాశాలనూ పరిశీలిస్తం" అని అమృతా రాయ్‌‌కి ప్రధాని మోదీ చెప్పినట్లు బీజేపీ పార్టీ వర్గాలు వివరించాయి.

 ఈడీ అటాచ్ చేసిన అవినీతి సొమ్ముపై తన స్టాండ్ గురించి ప్రజలకు తెలియజేయాలని ఆమెకు మోదీ సూచించారని తెలిపాయి. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ప్రధాని భరోసా ఇచ్చినట్లు సమాచారం. 

ప్రతిపక్షాలకు అధికారమే ముఖ్యం

అవినీతి కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై మోదీ మండిపడ్డారు. ఒకప్పుడు ఆప్‌‌ అవినీతిపై ఫిర్యాదు చేసిన వారే ఇప్పుడు ఆ పార్టికీ సహాయం చేస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి యువత ఉజ్వల భవిష్యత్తు కోసం, అవినీతిరహిత దేశం కోసం పోరాడుతోందని తెలిపారు. మరోవైపు అవినీతిపరులందరూ  ఏకమయ్యారని.. ఒకరినొకరు రక్షించుకునే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. అమృతా రాయ్‌‌ కుటుంబానికి చెందిన రాజా కృష్ణచంద్ర రాయ్‌‌ బ్రిటీషర్లకు సాయం చేయలేదని తెలిపారు.

 ఆయన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఇతర రాజులతో చేతులు కలిపారని వివరించారు. రాజకీయాల్లో రకరకాల ఆరోపణలు చేస్తారని, ఎటువంటి ఒత్తిడికి గురికావద్దని అమృతా రాయ్‌‌కి మోదీ సూచించారు.  గెలుపుపై విశ్వాసంతో పనిచేయాలని..గెలిచిన మొదటి 100 రోజుల్లో నియోజకవర్గాంలో అమలు చేయబోయే ఎజెండాతో సిద్ధంగా ఉండాలని చెప్పారు.  అనంతరం విలేకరులతో మాట్లాడిన అమృతా రాయ్.. ప్రధాని 
ఇచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు.