ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి.. ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలకు షర్మిల పిలుపు

ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి.. ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలకు షర్మిల పిలుపు

హైదరాబాద్, వెలుగు : పీఆర్సీ కమిషన్ ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు, పేపర్ లీకేజీ వంటి సమస్యలపై పోరాటానికి కార్యాచరణ ఖరారు చేసేందుకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో షర్మిల అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆదివారం పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, వెంటనే న్యాయం జరగాలని, వారి పక్షాన పోరాటం చేసేందుకు వైఎస్ఆర్టీపీ టీసేవ్ ఫోరం (తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయిమెంట్) ఏర్పాటు చేసింది. ‘‘రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులే.. ఇయ్యాల కొలువుల్లేక చీకట్లో మగ్గుతున్నరు. సర్కారు తీరుతో సూసైడ్​ చేసుకుంటున్నరు.

టీఎస్ పీఎస్సీ అవినీతి ఊబిలో చిక్కుకుపోయింది. బీఆర్ఎస్ పెద్దలు, బోర్డు సభ్యులు క్వశ్చన్​ పేపర్లను అంగట్లో సరుకుల్లా అమ్ముకుంటున్నారు. పైసలు ఇచ్చినోడికి నౌకరీలు వస్తున్నయ్. నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న ప్రతిపక్షాలను సర్కార్​ అణచివేస్తున్నది. అందుకే నిరుద్యోగులు, స్టూడెంట్స్​ కోసం అందరం ఏకమై పోరాడాలి” అని షర్మిల 
పిలుపునిచ్చారు.

టీసేవ్ ఫోరం డిమాండ్లు

  •      బిస్వాల్ కమిషన్ ప్రకారం వెంటనే 1.91లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి.
  •      కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల జాబ్స్ భర్తీ చేయాలి.
  •      టీఎస్ పీఎస్సీ కమిషన్​ చైర్మన్, సెక్రటరీ, మెంబర్లను తొలగించి కొత్తవారిని నియమించాలి.
  •      పేపర్ లీకేజ్ కేసును సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో ఎంక్వైరీ చేయించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.
  •      నిరుద్యోగులకు రూ.3,016 భృతి చెల్లించాలి.
  •      బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా అర్హులకు లోన్లు ఇవ్వాలి.
  •      ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలి.
  •      వర్సిటీలు, కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయాలి.
  •      హాస్టల్స్​లో మంచి భోజనం పెట్టాలి.