
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పౌరసత్వం కేసులో బిగ్ రిలీఫ్ దక్కింది. రాహుల్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు (లక్నో బెంచ్) సోమవారం (మే 5) కొట్టివేసింది. పౌరసత్వం అనేది రెండు దేశ ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కావడంతో రాహుల్ సిటిజన్‌షిప్‌పై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ సమాచారాన్ని పిటిషనర్‌కు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను కూడా అలహాబాద్ హైకోర్టు పిటిషనర్‌కు కల్పించింది.
కాగా, రాహుల్ గాంధీకి ద్వంద పౌరసత్వం ఉందని కర్ణాటకకు చెందిన విఘ్నేష్ శిశిర్ అనే న్యాయవాది అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. భారత్‌తో పాటు బ్రిటన్‌లో కూడా రాహుల్ గాంధీకి పౌరసత్వం ఉందని ఆయన ప్రధాన ఆరోపణ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84(A) ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి రాహుల్ గాంధీ అనర్హుడని పిటిషన్లో పేర్కొన్నారు. 2025, మార్చి 24న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. 4 వారాల్లోగా రాహుల్ పౌరసత్వంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
►ALSO READ | ఎన్నిసార్లు చెప్పాలి.. పబ్లిసిటీ స్టంట్స్ ఆపండి: పహల్గాం ఇష్యూ పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సీరియస్
అనంతరం కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2025, మే 5న ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన జస్టిస్ ఎఆర్ మసూది, జస్టిస్ రాజీవ్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం.. రాహుల్ సిటిజన్ షిప్‌పై నిర్దేశించిన టైమ్ లోగా కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన సమయంలో పిటిషనర్ ఫిర్యాదుకు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేకపోతుంది.
ఇటువంటి పరిస్థితిలో పిటిషన్‌ను దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచడం సమర్థనీయం కాదని పేర్కొంది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని.. రాహుల్ పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత పిటిషనర్ మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది.