ఎన్నిసార్లు చెప్పాలి.. పబ్లిసిటీ స్టంట్స్ ఆపండి: పహల్గాం ఇష్యూ పిటిషనర్‎పై సుప్రీంకోర్టు సీరియస్

ఎన్నిసార్లు చెప్పాలి.. పబ్లిసిటీ స్టంట్స్ ఆపండి: పహల్గాం ఇష్యూ పిటిషనర్‎పై సుప్రీంకోర్టు సీరియస్

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాడి నేపథ్యంలో జమ్మూలోని కొండ ప్రాంతాలలో పర్యాటకుల భద్రత కోసం మెరుగైన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‎ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సున్నితమైన పహల్గాం ఇష్యూపై పదే పదే పిటిషన్లు దాఖలు చేస్తోన్న న్యాయవాదికి దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. కాగా, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‎పై న్యాయ విచారణ కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ గత వారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‎ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం.. పిటిషనర్‎పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 దేశ సైనికుల మనోధైర్యాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించవద్దని సూచించింది. ఇదిలా ఉండగానే.. పహల్గాం ఉగ్రవాడిని దృష్టిలో పెట్టుకుని జమ్మూలోని కొండ ప్రాంతాలలో పర్యాటకుల భద్రత కోసం మెరుగైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విశాల్ తివారీ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై సోమవారం ( మే 5) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‏ను తోసిపుచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ విశాల్ తివారీపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.  

►ALSO READ | జమ్మూ కాశ్మీర్ జైళ్లపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందా..? : నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి..?

‘‘సైనికుల మనోధైర్యాన్ని దెబ్బ తీసే విధంగా ప్రయత్నించవద్దని చివరి సారే మీకు చెప్పాం. అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి..? ఈ పిటిషన్లు దాఖలు చేయమని మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు..? పహల్గాం టెర్రర్ ఎటాక్ ఎంతటి సున్నితమైన ఇష్యూనో మీకు అర్థం కావడం లేదా..? మీకు బాధ్యత లేదా..?"  ప్రశ్నించింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం ఇదే తొలిసారి.. అందుకే పర్యాటకులకు మెరుగైన భద్రత కల్పించాలనేది మా ఉద్దేశమని పిటిషనర్ పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు ఆసక్తి చూపని ధర్మాసనం పిటిషనర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

 పిటిషనర్ ప్రజా ప్రయోజనాలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం.. వెంట వెంటనే పిటిషన్లు దాఖలు చేస్తున్నాడని.. అలాంటి పిటిషన్లను కొట్టివేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. కాగా, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని ముష్కరులు నరమేధం సృష్టించారు. ఉగ్రవాదులు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయక పర్యటకులు మరణించారు.