జమ్మూ కాశ్మీర్ జైళ్లపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందా..? : నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి..?

జమ్మూ కాశ్మీర్ జైళ్లపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందా..? : నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి..?

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల నరమేధం తర్వాత.. భారత ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే పాకిస్తాన్ దేశంలో జల, వాణిత్య యుద్ధంతోపాటు టెక్నాలజీ యుద్ధాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇండియాలో తలదాచుకున్న ఉగ్రవాదులు మరిన్ని దాడులు చేసే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో.. భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జైళ్లల్లో చాలా మంది ఉగ్రవాదులు, టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నవారు, స్లీపర్ సెల్స్ కింద పని చేస్తున్న వారు ఉన్నారు. వీళ్లందరినీ లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని జైళ్లపై దాడులు చేయొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో.. అన్ని జైళ్లకు భద్రతను పెంచారు. హై సెక్యూరిటీ కల్పించారు అధికారులు. రెగ్యులర్ ఉంటే భద్రత కంటే అదనపు బలగాలను జైళ్లకు తరలించారు. జైళ్లల్లోని అన్ని సెల్స్ ను తనిఖీ చేస్తున్నారు. జైళ్లల్లోని స్లీపర్ సెల్స్ నుంచి బయట ఉన్న ఉగ్రవాదులకు ఏమైనా సమాచారం వెళుతుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. 

జమ్మూకాశ్మీర్ లోని జైళ్ల భద్రతను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం.. CISF పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలోనే 2025, మే 4వ తేదీన సీఐఎస్ఎఫ్ (CISF) డైరెక్టర్ జనరల్ శ్రీనగర్ లోని భద్రతా అధికారులతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఉన్న భద్రత ఎంత.. మరింత భద్రత పెంచటానికి కావాల్సిన చర్యలపై చర్చించారాయన. అదే విధంగా జైళ్లల్లో ఉన్న ఉగ్రవాదులతో.. బయట ఉన్న ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా.. ములాఖత్ కు ఎవరెవరు వస్తున్నారు.. ములాఖత్ కు వచ్చే వాళ్ల ద్వారా ఏమైనా సమాచారం పంపిస్తున్నారా ఇలాంటి విషయాలపై ఈ మీటింగ్ లో సీరియస్ డిస్కషన్ జరిగింది.

జైళ్లల్లో ఉండే ఉగ్రవాదులకు బయట నుంచి వచ్చే సమాచారం చేరకుండా చేయాలని.. అదే సమయంలో జైళ్లల్లోని ఉగ్రవాదుల నుంచి బయటకు సమాచారం వెళ్లకుండా చేయాల్సిన అవసరాన్ని గట్టిగా గుర్తు చేశారు CISF డైరెక్టర్ జనరల్. ప్రస్తుతం జైళ్లల్లో వాడుతున్న నెట్ వర్క్ టెక్నాలజీపైనా సమీక్ష చేశారాయన. 

జమ్మూకాశ్మీర్ లోని అన్ని జైళ్లకు హై సెక్యూరిటీ ఇస్తూ.. అదనపు బలగాలను మోహరించే విధంగా ఆదేశాలు ఇచ్చారాయన.