31న టీజేఎఫ్ రజతోత్సవాలు: అల్లం నారాయణ ప్రకటన

31న టీజేఎఫ్ రజతోత్సవాలు: అల్లం నారాయణ ప్రకటన

హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) చారిత్రాత్మక పాత్రను తెలియజేయడానికి ఈనెల 31న రజతోత్సవాలను నిర్వహిస్తామని టీజేఎఫ్ అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.  హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ఈ రజతోత్సవాలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో  ఆవిష్కరించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ 2001 మే 31న స్థాపితమైన టీజేఎఫ్.. రాష్ట్రం సాధించే వరకు క్రియాశీలకంగా పనిచేసిందన్నారు. 

ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులను ఒకే వేదికపైకి తెచ్చిందని గుర్తుచేశారు. ఉద్యమ టైంలో టీజేఎఫ్ పాత్రను సమాజానికి మరోసారి తెలియజెప్పేందుకే టీజేఎఫ్ రజతోత్సవాలు నిర్వహిస్తున్నామని అల్లం పేర్కొన్నారు.  తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ చేసిన ఉద్యమం మిగతా ఉద్యమాలకు దిక్సూచి లాంటిదని టీజేఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, రమణ కుమార్, శశికాంత్ పాల్గొన్నారు.