సీఎండీపై ఆరోపణలు.. ఏడీఈ సస్పెన్షన్​

సీఎండీపై ఆరోపణలు.. ఏడీఈ సస్పెన్షన్​

హైదరాబాద్‌‌, వెలుగు: టీఎస్‌‌ ఎస్పీడీసీఎల్‌‌  సీఎండీ రఘుమారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ సోషల్‌‌ మీడియాలో ఆరోపణలు చేసిన ఏడీఈ కోటేశ్వర్‌‌రావును సస్పెండ్​ చేశారు. కోటేశ్వర్​రావు సంస్థ రూల్స్​ను అతిక్రమించారని, అందుకే వేటు వేస్తున్నామని పేర్కొంటూ సీఎండీ రఘుమారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్​ ఎస్పీడీసీఎల్​లో భారీగా అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా పనులు అప్పజెప్తున్నారని కోటేశ్వర్​రావు ఈ నెల 4వ తేదీన ఫేస్​బుక్​లో వీడియో పోస్టు చేశారు. ఇది సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. 3.73 లక్షల వ్యూస్‌‌ రాగా.. ఆరు వేల మందికిపైగా ఆ పోస్టును షేర్​ చేశారు. అవినీతి అంశంపై అంతటా చర్చ మొదలైంది. ఈ క్రమంలో బుధవారం కోటేశ్వర్​రావును సస్పెండ్​ చేశారు. ఏపీఎస్‌‌ఈబీ, టీఎస్‌‌ ఎస్పీడీసీఎల్‌‌ రెగ్యులేషన్‌‌  రూల్స్​ను అతిక్రమించారని పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హెడ్‌‌ క్వార్టర్‌‌ (హైదరాబాద్‌‌ ) వదిలి వెళ్లకూడదని ఆదేశించారు.

కోటేశ్వర్​రావు చేసిన ఆరోపణలేంటి?

ఈ నెల4న కోటేశ్వర్‌‌రావు టీఎస్‌‌ ఎస్పీడీసీఎల్‌‌ సీఎండీ రఘుమారెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఫేస్‌‌బుక్‌‌ లైవ్‌‌ ద్వారా 45 నిమిషాల వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో కోటేశ్వర్​రావు చేసిన ఆరోపణలివీ..

తూర్పుగోదావరికి చెందిన ప్రదీప్‌‌ ఎలక్ట్రికల్స్​ ఏడుకొండలు అనే ఒకే ఒక్క కాంట్రాక్టర్ కు 4,769 ఎలక్ట్రికల్‌‌ వర్క్‌‌లు ఇచ్చారు. ఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌ రేట్లకు విరుద్ధంగా ఇష్టానుసారంగా రూ.30.69 కోట్ల వర్క్‌‌లు ఇచ్చారు.

ట్రాన్స్​ఫార్మర్స్ దగ్గర రక్షణగా ఏర్పాటు చేసే ఫెన్సింగ్‌‌ పనుల కోసం మెదక్ డివిజన్ లో స్క్వేర్ ఫీట్ రూ.56 రేటుతో నామినేషన్ మీద పని ఇచ్చారు. అదే పనిని వేరే డివిజన్ లో స్క్వేర్ ఫీట్ రూ.125కు, మరో డివిజన్‌‌లో రూ.284కు, వికారాబాద్ డివిజన్‌‌లో ఏకంగా రూ.384 నామినేషన్ పై ఇచ్చారు. ఫెన్సింగ్ పరికరాలు రాణిగంజ్ లో కిలోల లెక్క దొరుకుతాయి. స్క్వేర్ ఫీట్ రూ.28 నుంచి 34కే వస్తుంది. భారీ అవినీతి చేశారు.

విద్యుత్‌‌  లైన్లకు అడ్డు వస్తున్నాయంటూ చెట్ల కొమ్మల నరికివేతలో కోట్ల స్కామ్‌‌ జరిగింది. ఫీడర్ల పరిధిలో తప్పుడు రిపోర్టులతో విజిలెన్స్‌‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పవర్​ కండక్టర్ (కేబుల్) కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగింది. ఇండియాలో తక్కువ ధరకు దొరికే కండక్టర్‌‌ ను కిలోమీటర్ కు 10 లక్షల రేటుతో ఐదు రెట్లు ఎక్కువ పెట్టి కొన్నారు. దీంట్లో పెద్ద కుంభకోణం జరిగింది. ఇలానే ఏపీలో జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ అక్కడి డిస్కం సీఎండీ దొర రాజీనామా చేశారు. రాష్ట్రంలో అలాంటివే జరగలేదు.

సదాశివరెడ్డి అనే వ్యక్తి రఘుమారెడ్డికి బినామీగా వ్యవహరిస్తూ అక్రమాలు చేస్తున్నారు. రఘుమారెడ్డిపై రహస్య నివేదికను సీఎంకు పంపాను. సీఎండీకి అడ్వొకేట్‌‌ ద్వారా నోటీసు ఇవ్వాలని నిర్ణయించుకున్నా.

రూల్స్ అతిక్రమించినందుకే..

నిబంధనలను అతిక్రమించినందుకే కోటేశ్వర్‌‌రావుపై చర్యలు తీసుకున్నం. 21 వేల మంది ఉద్యోగులున్న ప్రతిష్టాత్మకమైన టీఎస్‌‌ఎస్పీడీసీఎల్‌‌ సంస్థ రూల్స్​ను అతిక్రమించి ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదు. అందుకే ఏడీఈని సస్పెండ్‌‌ చేశాం. – రఘుమారెడ్డి, టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీ

నేను నష్టపోయినా పర్లేదు..

సంస్థ మనుగడే ముఖ్యం. నేను నష్టపోయినా ఫర్వాలేదు. సంస్థను కాపాడేందుకు నేను మొదటి నుంచి పనిచేస్తున్న. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా.. కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. వాస్తవాలు సీఎం వరకు చేరాలి.         – ఏడీఈ కోటేశ్వర్‌‌రావు