బీజేఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి

బీజేఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  •     డిప్యూటీ లీడర్లుగా పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డి
  •     మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్​గా ఏవీఎన్ రెడ్డి
  •     త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు : ఎట్టకేలకు బీజేపీ శాసనసభా పక్షనేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డిని నియమించారు. ఎల్పీ సెక్రటరీగా ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, పార్టీ చీఫ్ విప్ గా పాల్వాయి హరీశ్ బాబు, విప్ గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ట్రెజరర్ గా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డిని నియమిస్తూ బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఏడుగురికి ఎల్పీ పదవులు దక్కాయి. పదవి దక్కని వారిలో ఒక్క రాజాసింగ్ మాత్రమే ఉన్నారు. ఆయనను త్వరలోనే పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమిస్తారని పార్టీ వర్గాలు  చెప్తున్నాయి. 

పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి.. ఇద్దరే సీనియర్లు. మిగితా ఆరుగురు మొదటిసారి ఎన్నికైన వారే. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం ఎత్తుకున్న బీజేపీ, ఎల్పీ నేతగానైనా బీసీని నియమిస్తారని అంతా భావించారు. కానీ బీసీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎల్పీలో ఏ పదవి దక్కలేదు. ఇక ఎల్పీ పదవిపై ఆశలు పెట్టుకున్న మరో బీసీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తోనే సరిపుచ్చారు. ఇటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్  రెడ్డి, అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు కావడంతో పార్టీలో చర్చ సాగుతున్నది. బీసీలకు పదవి ఇవ్వకపోవడంపై పార్టీలోని బీసీ నేతలు రాష్ట్ర, జాతీయ నాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇక శాసన మండలిలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డిని మండలి ఫ్లోర్ లీడర్ గా నియమించారు.