జనసేనకు ఏ సీట్లు ఇద్దాం?.. సెకండ్​ లిస్ట్​పై  బీజేపీ కసరత్తు 

జనసేనకు ఏ సీట్లు ఇద్దాం?.. సెకండ్​ లిస్ట్​పై  బీజేపీ కసరత్తు 

హైదరాబాద్, వెలుగు:  రెండో విడత జాబితా, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించనున్న సీట్లపై బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పార్టీ స్టేట్ ఆఫీసులో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఎన్నికల ఇన్​చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్​చార్జి సునీల్ బన్సల్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావుతో పాటు మరి కొందరు సీనియర్ నేతలు సమావేశమయ్యారు. వచ్చే నెల1న ఢిల్లీలో బీజేపీ  కేంద్ర ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది.

ఆ మీటింగ్ లో రెండో విడత జాబితాను ఆమోదించుకోవాల్సి ఉంది. దీని కోసం సెకండ్ లిస్టును  ఫైనల్ చేసే పనిలో రాష్ట్ర నేతలు ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ లిస్టులో 52 మందిని ఖరారు చేశారు. ఇంకా 67 మంది అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే రెండో లిస్టులో కనీసం 35  నుంచి 40 మందిని ఖరారు చేయడంలో భాగంగా ఈ భేటీలో కసరత్తు జరిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారవడంతో.. ఆ పార్టీ అడుగుతున్న సీట్లు, ఏయే స్థానాలు ఇవ్వాలనే దానిపై కూడా చర్చించినట్లు సమాచారం. 

1న తేలే చాన్స్​

పవన్ కల్యాణ్ ఇప్పటికే 32 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఆయనకు 6 నుంచి10 సీట్ల వరకు ఇచ్చే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సీట్లు కూడా ఎక్కడ ఇవ్వాలనే దానిపై గురువారం జరిగిన భేటీలో చర్చకొచ్చినట్లు సమాచారం. జనసేన అడుగుతున్న సీట్లలో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి ఉండటంతో వీటి విషయంలో బీజేపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు.  

ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో జనసేన అడుగుతున్న సీట్లపై కూడా ఇందులో చర్చ జరిగినట్లు సమాచారం. ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి...అవి ఎక్కడెక్కడ ఇవ్వాలనే దానిపై సూచన ప్రాయంగా కిషన్ రెడ్డి, ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ మధ్య చర్చ సాగినట్లు సమాచారం. వచ్చే నెల 1 న జరగనున్న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్  కమిటీ మీటింగ్ లో ఈ సీట్ల కేటాయింపుపై ఫైనల్ నిర్ణయం జరిగే చాన్స్​ఉంది. 

బీజేపీ నేతల్లో టెన్షన్

జనసేనతో పొత్తు ఖరారవడంతో బీజేపీలోని పలువురు టికెట్ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. జనసేన అడుగుతున్న సీట్లలో తాము పోటీ చేయాలనుకున్న నియోజకవర్గాలు ఉండటంతో తమ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.  కూకట్ పల్లి, శేరిలింగంపల్లి టికెట్లను జనసేన అడుగుతున్నట్లు మీడియాలో ప్రచారం కావడంతో ఆ రెండు నియోజకవర్గాల బీజేపీ నేతలు టెన్షన్ పడిపోతున్నారు. ఇదే పరిస్థితి జనసేన అడుగుతున్న.. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలోని  పలు నియోజకవర్గ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.

శేరిలింగంపల్లి టికెట్ బీజేపీ నేత యోగానంద్ కే ఇవ్వాలంటూ గురువారం పార్టీ స్టేట్ ఆఫీసు ముందు ఆయన అనుచరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇక్కడ రవికుమార్ యాదవ్ కూడా టికెట్ అడుగుతుండటంతో పార్టీలో మొదటి నుంచి ఉన్న యోగానంద్ కే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరికి జనసేన టెన్షన్​ పట్టుకుంది.