
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆల్ఫోర్స్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఎం.పూజశ్రీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలను అందుకున్నది. జాతీయ స్థాయిలో ఇన్స్ పైర్ అవార్డుకు ఎంపికైన ప్రదర్శనలను మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో టెక్నాలజీ సమిట్ లో భాగంగా ప్రదర్శించారు. ఇందులో స్కూల్ బస్సు కు ఆక్సిల్ కెమెరాలు బిగించడం ద్వారా మూగజీవాలను ప్రమాదం బారి నుంచి రక్షించవచ్చనే అంశాన్ని పూజశ్రీ ప్రదర్శించింది. స్కూల్ బస్సు కింద సేదతీరే మూగ జీవాలను గమనించకుండా బస్సును స్టార్ట్ చేయడం వల్ల అవి ప్రమాదానికి గురై చనిపోయే సందర్భాలు అనేకం జరుగుతుంటాయి.
ఇలా బస్సుల కింద సేదతీరే మూగజీవాలను కాపాడేలా ఆమె చక్కటి ఎగ్జిబిట్ ను తయారుచేసి వివరించింది. దీనిని తిలకించిన రాష్ట్రపతి ఆమెను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని క్రియేటివిటీ వెలుగులోకి రావడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. తమ స్టూడెంట్ రూపొందించిన ప్రదర్శన రాష్ట్రపతి తిలకించడానికి ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు.