హైదరాబాద్, వెలుగు: ఫామ్హౌస్సర్వే పూర్తయిన తర్వాత 325లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని నిబంధనల ప్రకారం స్థానికంగా ఉన్న అర్హులైన నిరుపేద రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ ఫాంహౌస్‌కు సరిగ్గా ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 325లోని స్థలంలో ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన ఉద్యమ అమరుల కుటుంబాలను గౌరవించేలా, ఈ భూమిలోనే వారికి పక్కాగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ తదితర సకల మౌలిక వసతులతో ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఈ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర గృహనిర్మాణ శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాలనీ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి అమరవీరుల కుటుంబాలకు ఇళ్లను అప్పగించాలన్నారు. ఇందుకు సంబంధించిన లేఅవుట్ డిజైన్లు, మౌలిక వసతుల అంచనాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని హౌసింగ్ అధికారులకు సీఎం తేల్చి చెప్పారు.
