
శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్ర కాశ్మీర్ లోయలోని బేస్ క్యాంపుల నుంచి గురువారం ప్రారంభమైంది. గందర్‌బాల్ జిల్లాలోని బాల్టాల్, పహల్గాంలోని నున్వాన్ క్యాంపుల నుంచి రెండు బ్యాచ్‌ల యాత్రికుల ప్రయాణాన్ని అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. బుధవారం 5,892 మంది యాత్రికుల మొదటి బ్యాచ్‌ను జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద ఎల్జీ మనోజ్ సిన్హా జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.
ఆ బ్యాచ్ నున్వాన్ బేస్‌కు చేరుకోగానే అధికారులు స్వాగతం పలికారు. 5,200 మందికి పైగా యాత్రికులతో కూడిన రెండవ బృందం బాల్టాల్ బేస్ నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకు బయల్దేరిని యాత్రికుల సంఖ్య 11,138కి చేరుకుంది. యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, పారామిలిటరీ దళాల నుంచి వేలాది మంది సిబ్బందిని మోహరించారు. 38 రోజుల ఈ యాత్ర ఆగస్టు 9న ముగుస్తుంది.