- ముహూర్తం బాగాలేదని పిల్లలను పంపని పేరెంట్స్
- రాష్ట్రవ్యాప్తంగా సర్కారులో కేవలం 11 శాతమే హాజరు
- టీచర్లు 62 శాతం మంది వచ్చినా.. స్టూడెంట్స్ నిల్
- పలు ప్రైవేటు స్కూళ్లకు ముందే సెలవు
- 17 నుంచే మొదలు కానున్న సందడి
- 1,116 బడుల్లో ప్రారంభమైన బ్రేక్‌ఫాస్ట్ స్కీం
- పలుచోట్ల ముగ్గులు పెట్టి, హారతి పట్టి..
- పిల్లలు, టీచర్లకు గ్రామస్తుల స్వాగతం
- సర్కారు బడికే పంపుతామని
- పలు పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భీమదేవరపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్‌టౌన్, శివ్వంపేట, నిజాంపేట వెలుగు: రాష్ట్రంలో బడుల రీ ఓపెన్‌పై అమావాస్య ఎఫెక్ట్ పడింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం స్కూళ్లు తెరుచుకున్నప్పటికీ క్లాస్ రూములన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ నెల 12నే స్కూళ్లు తెరవాలని సర్కారు భావించినా, మధ్యలో రెండో శనివారం, ఆదివారం రావడంతో 15వ తేదీకి వాయిదా వేసింది. తీరా చూస్తే సోమవారం అమావాస్య కావడంతో పిల్లలను పంపేందుకు పేరెంట్స్ ఇష్టపడలేదు.
సోమవారం సర్కారు బడుల్లో కేవలం 11 శాతం మంది పిల్లలు మాత్రమే హాజరు కాగా.. మిగిలిన వారు సెంటిమెంట్ పేరుతో ఇంటికే పరిమితమయ్యారు. ఇదే అదనుగా టీచర్లు కూడా విధులకు ఎగనామం పెట్టారు. ఏకంగా 38శాతం టీచర్లు తొలిరోజు విధులకు హాజరు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా బడిబాట తొలిరోజే వెలవెలబోయింది. ఎఫ్ఆర్ఎస్ గణాంకాలను పరిశీలిస్తే విద్యార్థుల హాజరు శాతం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో మొత్తం 15,29,439 మంది గవర్నమెంట్ స్టూడెంట్లకు గాను.. కేవలం 1,71,223 (11.19%) మంది మాత్రమే బడి మెట్లెక్కారు.
అంటే, దాదాపు 89 శాతం మంది విద్యార్థులు మొదటిరోజు బడికి దూరంగా ఉన్నారు. హనుమకొండ లష్కర్ బజార్ గర్ల్స్ స్కూల్లో ఆరుగురు టీచర్లు ఉంటే.. ఐదుగురు విద్యార్థులే వచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ హైస్కూల్‌లో 15 మంది టీచర్లు ఉన్నా.. ఇద్దరే ఇద్దరు స్టూడెంట్స్ హాజరయ్యారు. పిల్లలు రాకపోవడంతో టీచర్లు నేరుగా పలు ఊర్లలో ని విద్యార్థుల ఇండ్లకు వెళ్లారు. ‘ఈ రోజు అమావాస్య.. రేపు మంగళవారం.. అందుకే పంపడం లేదు.. బుధవారం నుంచి పంపిస్తాం’ అని పేరెంట్స్ వారికి చెప్పినట్టు టీచర్లు వెల్లడించారు. మరోపక్క పలు సర్కారు స్కూళ్లు విద్యార్థులు రాక తెరుచుకోలేదు. ప్రైవేటు స్కూళ్లు మాత్రం 17వ తేదీ నుంచే తరగతులు ప్రారంభిస్తామని ముందే సెలవులు ప్రకటించాయి.
పండుగ వాతావరణంలో బడుల రీ ఓపెన్
తొలిరోజు హాజరు తక్కువగా ఉన్నా.. వచ్చిన కొద్దిమంది పిల్లలకు పలు గ్రామాల్లో పండుగ వాతావరణంలో స్వాగతం పలికారు. గ్రామస్తులు, ఏఎంపీసీ, ఎస్ఎంసీ సభ్యులు స్కూళ్ల ముందు ముగ్గులు వేసి, పిల్లలకు, టీచర్లకు హారతులు పట్టి ఆహ్వానించారు. స్కూళ్లకు వచ్చిన వారికి స్వీట్లు, చాకెట్లు ఇచ్చి సంతోష పర్చారు. చాలా బడులను బెలూన్స్, మామిడి తోరణాలతో ముస్తాబు చేశారు. పలు గ్రామాల్లో అయితే.. ‘మా పిల్లలను సర్కారు బడులకే పంపిస్తాం’ అంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. బడిబాటలో భాగంగా టీచర్లు చేస్తున్న కృషికి గ్రామస్థులు మద్దతుగా నిలుస్తున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, వేలేరు మండ లాల్లోని పలు పంచాయతీల్లో అందరు పిల్లలను సర్కారు బడికే పంపాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. తమ గ్రామంలోకి ప్రైవేటు స్కూల్ బస్ లకు ఎంట్రీ లేదంటూ భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి ఊరి ఎంట్రన్స్ లో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఎల్కతుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలోకి వచ్చిన ఆల్టిట్యూడ్ స్కూలు బస్సును సర్పంచ్ సిక ప్రదీప్, పంచాయతీ మెంబర్లు వెనక్కి పంపించేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కా రు బడిలోనే చదివించాలని సర్పంచ్ ప్రదీప్ గ్రామ స్తులను కోరారు. ఎవరైనా ప్రైవేటు స్కూలుకు పంపాలనుకుంటే ఊరి శివారులో ఉన్న బస్టాండ్ వద్ద పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించాలని సూచించా రు. వేలేరు మండలం శాలపల్లిలోకి ప్రైవేటు బస్సులను నిషేధిస్తూ సర్పంచ్ కూరపాటి అశోక్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.
భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లి గ్రామస్తులు మరో అడుగు ముందుకేశారు. గ్రామంలో ఐదో తరగతి లోపు చదువుతున్న పిల్లలను స్థానిక ప్రైమరీ స్కూలుకు మాత్రమే పంపించాలని, ప్రైవేటు స్కూలుకు పంపించే పేరెంట్స్ కు రూ.5 వేల జరిమానా విధించాలని సర్పంచ్ బోయిని మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో పాలకవర్గం తీర్మానించింది. తల్లిదండ్రులు ఊళ్లో ఉన్న బడికే పంపాలని కోరారు. హనుమకొండ జిల్లాలో అనేక గ్రామాల్లో ప్రైవేటుకు స్కూళ్లకు వ్యతిరేకంగా తీర్మానాలు చర్చనీయాంశమైంది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూలులో సోమవారం కొత్త విద్యాసంవత్సరాన్ని ఘనంగా నిర్వహించారు. స్కూలుకు రంగురంగుల కాగితా లు, బెలూన్లు, మామిడి తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. పాఠశాల ముందు ముగ్గులు పెట్టి.. హార తులు పట్టారు. స్కూలకు వచ్చిన స్టూడెంట్లకు టీచర్లు పూలుచల్లి, హారతులిచ్చి ఆహ్వానం పలికారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ గెజిటెడ్ నంబర్ 1 స్కూలు టీచర్లు తొలిరోజు స్కూలుకు వచ్చిన పిలల్లపై విద్యార్థులపై పూలు చల్లి, చాక్లెట్లు ఇచ్చి స్వాగతం పలికారు.
ఖమ్మం జిల్లాలోని కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు పూల బొకేలతో టీచర్లు స్వాగతం పలికారు. మరికొన్ని చోట్ల మామిడి తోరణాలు కట్టి, చాక్లెట్లు పంచి వెల్కమ్ చెప్పారు.
మిల్లెట్ ఇడ్లీతో బ్రేక్‌ఫాస్ట్ షురూ..
బడులు తెరిచిన తొలిరోజే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించింది. తొలిదశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, నారాయణపేట, వికారాబాద్ తదితర 8 జిల్లాల్లో 2,269 బడుల్లో 1.28 లక్షల మందికి ఈ స్కీము అమలు కావాల్సి ఉంది. కానీ, సోమవారం 8 జిల్లాల పరిధిలోని 1,120 బడుల్లో మొదలైంది. సుమారు 29 వేల మంది విద్యార్థులకు మిల్లెట్ ఇడ్లీ, సాంబార్‌ను అందించారు. హైదరాబాద్ రాజ్ భవన్ స్కూల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని ప్రారంభించి విద్యా ర్థులతో కలిసి టిఫిన్ చేశారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ హైస్కూల్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిని, భోజన నాణ్యతను పరిశీలించారు. అమావాస్య, మంగళవారం సెంటిమెంట్లు ముగియనుండటంతో బుధవారం నుంచి బడులన్నీ పూర్తిస్థాయిలో కళకళలాడుతాయని అధికారులు చెప్తున్నారు.
టీచర్లదీ అదే దారి..
టీచర్లు కూడా సెంటిమెంట్‌ను గట్టిగానే నమ్ముతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,21,041 మంది టీచర్లు ఉండగా.. వారిలో 75,258 (62.17%) మంది విధులకు హాజరయ్యారు. కొందరు వ్యక్తిగత పనులతో డ్యూటీకి అటెండ్ కాలేదు. కానీ, మెజార్టీ టీచర్లు మాత్రం మూఢనమ్మకాలను విశ్వసిస్తూ.. స్కూల్‌కు డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. పలు బడుల్లో టీచర్లు వచ్చినా.. క్లాస్ రూముల్లో విద్యార్థులు లేక బెంచీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రైవేటు బడుల్లోనూ ఇదే తీరు కనిపించింది. స్టూడెంట్లది 20 నుంచి 30శాతం ఉండగా, టీచర్లది 60శాతం దాటలేదని అధికారులు చెప్తున్నారు.
470 మంది విద్యార్థులకు నలుగురే హాజరు
మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండల కేంద్రంలో ఉన్న జడ్పీ హైస్కూల్‌లో మొత్తం 470 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం స్కూల్స్ రీఓపెన్ అయినప్పటికీ అమావాస్య కావడంతో నలుగురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. జిల్లాలోని చాలా స్కూళ్లలో విద్యార్థుల హాజరుపై అమావాస్య ఎఫెక్ట్ కనిపించింది. నిజాంపేట మండల కేంద్రంలోని హైస్కూల్లో 280 విద్యార్థులకు గానూ నలుగురు మాత్రమే హాజరయ్యారు, ప్రైమరీ స్కూల్ లో కేవలం 20 మంది వచ్చారు.
