అమెజాన్,ఫ్లిప్ కార్ట్ సామాన్లు ఇక ఆర్టీసీ కార్గోలో

అమెజాన్,ఫ్లిప్ కార్ట్ సామాన్లు ఇక ఆర్టీసీ కార్గోలో

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఆర్టీసీ కార్గో సేవలు అందించనుంది. దీనిపై మరో వారం రోజుల్లో ఒప్పందం కుదరనుంది. ఇప్పటికే చర్చలు ముగిశాయని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ఆయా సంస్థల అన్ని రకాల వస్తువులను కార్గోలో వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ రవాణా చేయనుంది. రిలయన్స్‌, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్‌‌), డీమార్ట్ తో  నూ చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలు కొలిక్కి రాగానే ఈ సంస్థలతోనూ ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకొని, వాటి సామాన్లను కూడా రవాణా చేయనుంది. ఇప్పటికే అనేక ప్రైవేట్‌ సంస్థలకు ఆర్టీసీ కార్గో  సర్వీసులు అందిస్తోంది.

 కార్గోకు సాధారణ రేట్లే..

రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 19 నుంచి కార్గో, పార్సిల్‌, కొరియర్‌‌ సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది. కరోనా ఎఫెక్ట్ ఆర్టీసీ బస్సుల ఎక్కేందుకు జనం పెద్దగా ఇష్టపడకపోవడంతో ఇలాంటి టికెట్టేతర ఆదాయంపై మేనేజ్‌మెంట్‌ ఫోకస్ పెట్టింది. ఇప్ప టికే ఆర్టీసీ బస్సుల్లో పార్సిల్‌, కొరియర్‌ సర్వీసులకు సంబంధించి రేట్లు ప్రకటించారు. బల్క్‌ ట్రాన్స్‌పోర్ట్ అయిన కార్గో రేట్లు ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రైవేట్‌ ఏజెన్సీ అమలు చేస్తున్న రేట్లనే తీసుకురానున్నారు. వన్‌వే చార్జీలే తీసుకోనున్నారు. దీనికి సంబంధించి అంతా రెడీ అయింది. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ సంతకం ఒక్కటే మిగిలి ఉంది. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ఎనిమిది టన్నుల సరకు రవాణాకు రూ. 30 వేలుగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో రెండు వేలు ఏజెంట్‌కు పోతాయి. ప్రైవేట్‌ ఏజెన్సీలు కూడా రూ. 30 వేల నుంచి 32 వేలు తీసుకుంటున్నాయి.

రెవెన్యూ టార్గెట్  రోజుకు రూ. 10 లక్షలు

ఆర్టీసీలో ఆల్టర్నేటివ్ ఆదాయం కోసం తీసుకొచ్చిన కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సర్వీసులు క్లిక్‌ అయినట్లుగా ఆఫీసర్లు భావిస్తున్నారు. కార్గో సర్వీసుల కంటే ముందు ఆర్టీసీలో పార్సిల్‌, కొరియర్ సర్వీసులను ప్రైవేట్‌ ఏజెన్సీ నిర్వహించేది. ఇందుకుగాను ఆర్టీసీకి  రోజుకు రూ. 2.3 లక్షలు మాత్రమే చెల్లించేది. ప్రస్తుతం ఆర్టీసీ  సొంతంగా వీటిని నడుపుతుండటంతో రోజుకు రూ. 7.5 లక్షల దాకా రెవెన్యూ వస్తోంది. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ. 2.5 కోట్ల దాకా రెవెన్యూ వచ్చిందని ఆఫీసర్లు చెబుతున్నారు. తమ టార్గెట్‌  రోజుకు రూ. 10 లక్షలుగా పెట్టుకు న్నామంటున్నారు. త్వరలోనే అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌ తదితర సంస్థలతో ఒప్పందంకుదిరాక.. టార్గెట్ను దాటిపోయే చాన్స్ ఉందంటున్నారు.

త్వరలో ఇంటర్‌ స్టేట్‌ ఏజెన్సీలు

కార్గో సేవలను విస్తరించడంలో భాగంగా ఇంటర్‌ స్టేట్‌ ఏజెన్సీలను ఆర్టీసీ  తీసుకురానుంది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై తదితర సిటీలకు ఏజెంట్లను పెట్టనుంది. దీంతో ఆయా సిటీలకు ఇక్కడి నుంచి సరుకు తీసుకుపో యినా, వచ్చేటప్పుడు ఆర్డర్  కోసం ఈ ఏజెంట్లు తోడ్పడనున్నారు. ప్రతి ఆర్డర్‌లో ఏజెంట్‌కు 10 శాతం కమీషన్‌ ఇస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా మండలాల్లో ఏజెంట్లను ఆర్టీసీ నియమించింది. మరికొన్ని చోట్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగుతోంది. అయితే త్వరలోనే కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్ట్ పోస్టును క్రియేట్ చేయనున్నారు. ఈ ఫైల్ ప్రభుత్వానికి కూడా చేరింది. అప్రూవల్ రాగానే ఓ సీనియర్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టనున్నారు