- ఆర్మీ మేజర్ అవతారమెత్తిన నిందితుడు, అతని తండ్రి అరెస్ట్
అంబర్పేట్, వెలుగు: యూకేలో ఉద్యోగం, వీసా ఇప్పిస్తామంటూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన తండ్రీకొడుకులను అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సిటీ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన కొడాలి శ్రీ సాయి అలియాస్ కార్తీక్ తనను తాను ఆర్మీ మేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. అంబర్‌పేటకు చెందిన బాధితుడు అనుమకొండ చంద్రశేఖర్‌కు యూకేలో జాబ్ ఇప్పిస్తానని నమ్మించి, దశలవారీగా డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఏకంగా రూ. 35.50 లక్షలు వసూలు చేశాడు.
డబ్బులు తీసుకున్న తర్వాత వీసా, టికెట్ల విషయంలో నిందితుడు కాలయాపన చేస్తూ బాధితుడిని ఊరించసాగాడు. చివరకు మోసపోయానని గ్రహించిన చంద్రశేఖర్ అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు గోవాలోని కోల్వా బీబ్లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి కొడాలి రవికుమార్‌తో కలిసి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
