V6 News

అంబర్ పేట్ బతుకమ్మకుంట రచ్చ... ఎంట్రన్స్ బోర్డు, గ్రిల్స్తొలగించాలన్న హైకోర్టు

అంబర్ పేట్ బతుకమ్మకుంట రచ్చ... ఎంట్రన్స్ బోర్డు, గ్రిల్స్తొలగించాలన్న హైకోర్టు
  • కుంట  తనదే అంటున్న బీఆర్ఎస్​నేత ఎడ్ల సుధాకర్​
  • గతంలోనే కోర్టుకు చేరిన వ్యవహారం 
  • బోర్డు తీసేసి గ్రిల్స్ విషయమై సుప్రీంకు హైడ్రా..
  • 3 వారాల్లో అఫిడవిట్ దాఖలుకు ఆదేశాలు 

హైదరాబాద్ సిటీ/ అంబర్ పేట్, వెలుగు: అంబర్​పేటలోని బాగ్ అంబర్ పేట్ డివిజన్​లో హైడ్రా అభివృద్ధి చేసిన బతుకమ్మ కుంట విషయంలో రచ్చ నడుస్తోంది. ఒకవైపు బతుకమ్మ కుంట తనదేనని అంబర్​పేట బీఆర్ఎస్​లీడర్​ఎడ్ల సుధాకర్​రెడ్డి వాదిస్తుండగా, కానే కాదని 80 ఏండ్లకు పూర్వం నుంచి అందుబాటులో ఉన్న మ్యాపులు, ఇతర రికార్డుల పరంగా అది కుంటనే అని, చుట్టుపక్కల పడ్డ వర్షం నీరు అందులోకి చేరేదని, అధ్వాన స్థితికి చేరుకున్న ఆ కుంటను అభివృద్ధి చేశామని హైడ్రా చెప్తోంది. 

మరోవైపు తరతరాలుగా బతుకమ్మ కుంటలో స్థానిక ప్రజలు ఈత కొట్టేవారని, ఇతర అవసరాలకు కూడా వినియోగించేవారని కుంట చుట్టుపక్కల నివసించే వృద్ధులు చరిత్ర తెలిసిన వారు చెప్తున్నారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా, హైడ్రా పేరిట ఏర్పాటు చేసిన బోర్డులు తొలగించాలని, పిల్లల పార్కు తీసెయ్యాలని ఆదేశాలు ఇవ్వడం, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు కొన్ని అమలు చేసిన హైడ్రా సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇంకోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒక్కటైన ఇతర పార్టీల లీడర్లు బతుకమ్మ కుంట వద్ద మంగళవారం నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొన్నది.  

హైకోర్టులో ఏం జరిగింది.. 

బతుకమ్మ కుంట తన పూర్వీకులదని, 1959 నుంచి తన వద్ద రికార్డులున్నాయని బీఆర్ఎస్​నేత ఎడ్ల సుధాకర్​రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైడ్రా కౌంటర్​దాఖలు చేసింది. 1950కి ముందు విలేజ్ మ్యాప్, రెవెన్యూ రికార్డులు, ఇరిగేషన్ డిక్లేర్​చేసిన ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది. వర్షం పడితే కుంట సమీపంలో ఉన్న ఓయూ ,శివం రోడ్డు, డీడీ కాలనీల నుంచి వరద బతుకుమ్మ కుంటకే వస్తుందని వాదించింది. కుంట పూడుకుపోవడంతో వరద కాలనీలను ముంచెత్తుతోందని, అందుకే, కుంటను అభివృద్ధి చేసి పూడిక తీస్తే వరద సమస్య పోతుందని, ఆ పనులకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరింది.

దీంతో ఆ పనులకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కానీ, హైడ్రా ఆ పనులతో పాటు ఎంట్రెన్స్​, పిల్లలు ఆడుకునే స్థలాలు, చుట్టూ వాకింగ్​ట్రాక్​, పార్కులు, కుంటలో ఎవరూ పడిపోకుండా గ్రిల్స్​ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఎడ్ల సుధాకర్​రెడ్డి హైకోర్టుకు తీసుకువెళ్లగా మార్చి17న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చింది.  

కుంట కోసం ఒక్కటైన అఖిల పక్షం నేతలు  

ముషీరాబాద్: కోర్టులో వ్యవహారం కొనసాగుతుండగానే మంగళవారం బతుకమ్మకుంటను పరిరక్షించాలంటూ బీఆర్ఎస్​మినహా రాజకీయ పార్టీలన్నీ ఏకమై నిరసనకు దిగాయి. అంబర్ పేట బతుకమ్మ కుంట ప్రధాన గేటు ఎదుట కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం బైఠాయించారు.  వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజలు తరతరాల నుంచి బతుకమ్మ కుంటలో ఈత కొట్టే వారని, కాలక్రమంలో కుంటను ఎవరూ పట్టించుకోక అధ్వానంగా తయారైందన్నారు.

కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక హైడ్రా బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు చేసిందని, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్​కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా బతుకమ్మ కుంట కోసం అందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ బతుకమ్మ కుంట విషయంలో నోరు తెరవాలన్నారు.

సుప్రీం కోర్టు స్పందించి కుంటపై నిజానిజాలు తేల్చేందుకు కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, బీజేపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్, సీపీఎం  నేత మహేందర్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ , సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎడెల్లి అజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు పుల్ల నారాయణస్వామి, దిడ్డి రాంబాబు, పులి జగన్, అమృత, ఇతర లీడర్లు పాల్గొన్నారు. కాగా, బతుకమ్మ కుంటను కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్​కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్​సుధాకర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

సుప్రీంకోర్టుకు వ్యవహారం..

హైకోర్టు ఆదేశాల మేరకు మూడు రోజులుగా బతుకమ్మ కుంట వద్ద హైడ్రా ఏర్పాటు చేసిన శిలాఫలకంతో పాటు ఎంట్రెన్స్ బోర్డును తొలగించింది. కానీ, గ్రిల్స్ తో పాటు పార్కు, చిల్డ్రన్ ప్లే ఏరియాని తొలగించాలనే అంశాన్ని సవాల్​చేస్తూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీం కోర్టు..కింది కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని చెప్పడంతో శిలాఫలకంతో పాటు ఎంట్రన్స్​బోర్డు తొలగించామని చెప్పింది. గ్రిల్స్ తొలగిస్తే కుంటలో పిల్లలతో పాటు పశువులు కూడా పడే ప్రమాదం ఉందని విన్నవించింది. దీంతో అక్కడ ఏం తొలగించారో..ఇంకేం తొలగించబోతున్నారో చెప్తూ మూడు వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని  ఆదేశించింది.