జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

ఎమర్జెన్సీ వాడకం కోసం మరో వ్యాక్సిన్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాన్సన్ & జాన్సన్ కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్‌ వాడకానికి అనుమతులిస్తున్నట్లు అమెరికా శనివారం ప్రకటించింది. దాంతో అమెరికాలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. గత డిసెంబర్‌లో ఫైజర్ మరియు మోడెర్నా వ్యాక్సిన్లకు అమెరికన్ ప్రభుత్వం ఆమెదం తెలిపింది. తాజాగా జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. ఫైజర్ మరియు మోడెర్నా వ్యాక్సిన్లు రెండు డోసులలో తీసుకోవాల్సి ఉండగా.. జాన్సన్ & జాన్సన్ మాత్రం కేవలం సింగిల్ డోస్ వ్యాక్సిన్ కావడంతో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తారని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) తెలిపింది. ఈ సింగిల్-షాట్ వ్యాక్సిన్ కోవిడ్ -19 ను నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని అంతేకాకుండా.. కొత్త వేరియంట్‌ల మీద కూడా బాగా పనిచేస్తుందని ఎఫ్‌డిఎ తెలిపింది.

‘ఇది అమెరికన్లందరికీ ఉత్తేజకరమైన వార్త మరియు కరోనా సంక్షోభానికి ముగింపు పలకడానికి మా ప్రయత్నాలలో ప్రోత్సాహకరమైన అభివృద్ధి’అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. వైరస్ నుంచి ఇప్పటికీ ముప్పు ఉందని హెచ్చరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అమెరికన్లను కోరారు. ఈ మూడో వ్యాక్సిన్ రోగనిరోధకత రేటును పెంచడానికి దోహదంచేస్తుందని ఆయన అన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 500,000 మందికి పైగా ప్రజలు కరోనావైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.

మార్చి చివరి నాటికి 20 మిలియన్ల డోసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జాన్సన్ & జాన్సన్ కంపెనీ ప్రకటించింది. జూన్ నాటికి 100 మిలియన్ల లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.