అమెరికా: వైట్ హౌస్‌‌‌‌ దగ్గర ర్యాలీ హింసాత్మకం 

అమెరికా: వైట్ హౌస్‌‌‌‌ దగ్గర ర్యాలీ హింసాత్మకం 

వాషింగ్టన్ లో ట్రంప్, బైడెన్ సపోర్టర్ల కొట్లాట

ట్రంపే గెలిచిండంటూ.. వేలాది మంది ర్యాలీ

బైడెన్  మద్దతుదారులూ రోడ్డెక్కడంతో లొల్లి షురూ 

పిడిగుద్దులు, చెంపదెబ్బలు.. బ్యాటన్ లతో కొట్టుకున్నరు

బ్లాక్ యువకుడికి కత్తిపోటు, ఇద్దరు పోలీసులకు గాయాలు

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ లీడర్ జో బైడెన్ గెలిచినట్లు మీడియా నెట్ వర్క్ లు ప్రకటించి వారం దాటుతున్నా.. రిపబ్లికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతుదారుల ర్యాలీలు మాత్రం ఆగడం లేదు. ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని, ట్రంపే గెలిచారంటూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ‘‘మిలియన్ మగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మార్చ్” పేరిట ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శనివారం వేలాది మంది ప్రొటెస్టర్లు వాషింగ్టన్ కు వచ్చి నిర్వహించిన  ర్యాలీ హింసాత్మకంగా మారింది. ర్యాలీ ఉదయం నుంచీ ప్రశాంతంగా సాగింది. అయితే రాత్రి పూట వైట్ హౌస్ కు కొద్ది దూరంలోని ఏరియాలో బైడెన్ సపోర్టర్లు కూడా రోడ్డెక్కి కోడిగుడ్లు విసరడంతో ఇరువర్గాల మధ్య లొల్లి షురువైంది. యాంటీ ట్రంప్ సపోర్టర్లు పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్లకార్డులను లాక్కుని తగలబెట్టడంతో తోపులాట జరిగిందని, చాలామంది బ్యాటన్స్ పట్టుకుని కొట్టుకున్నారని ‘ఫాక్స్ న్యూస్’ వెల్లడించింది. కొందరు పిడిగుద్దులు, చెంపదెబ్బలతో తమ ప్రతాపం చూపారని తెలిపింది. ఈ లొల్లిలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ నిరసనకారుడైన ఓ బ్లాక్ యువకుడు కత్తిపోటుకు గురయ్యాడు. ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో 20 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఫ్లోరిడా, అరిజోనా, జార్జియా, తదితర స్టేట్స్ లోనూ ట్రంప్ సపోర్టర్ల ర్యాలీలు కొనసాగుతున్నాయి.

ఈ మీడియా ప్రజలకు శత్రువు: ట్రంప్ 

ట్రంప్ శనివారం వైట్ హౌస్ నుంచి తన గోల్ఫ్ క్లబ్ కు వెళ్తుండగా పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద భారీగా పోగైన తన సపోర్టర్లకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. తర్వాత తనకు మద్దతుగా జరుగుతున్న భారీ నిరసనలను మీడియా చూపడంలేదని ఆయన ఆరోపిస్తూ.. ర్యాలీ ఫొటోను ట్వీట్ చేశారు. వాషింగ్టన్ లో తన సపోర్టర్లకు కౌంటర్ గా ప్రొటెస్టర్లు రోడ్ల మీదకు రావడాన్ని తప్పుపట్టారు. తన సపోర్టర్ల ధాటికి తట్టుకోలేక వారు పారిపోయారన్నారు. అమెరికాలో ఫేక్ న్యూస్ మీడియా ఉందని, ఇలాంటి మీడియా ప్రజలకు శత్రువన్నారు.