- 23న అమెరికా రాయబారి గోర్‌తో కలిసి ప్రారంభించనున్న సీఎం రేవంత్
- త్వరలో పలు రోడ్లకు గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీల పేర్లు పెట్టే యోచన
- తెలంగాణ, అమెరికాల మధ్య సంబంధాల విస్తరణకు సూచికగా ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో కలిసి ఈ రహదారిని అధికారికంగా ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబర్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ముందు ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యమైన అంతర్జాతీయ సంస్థలను, దేశాలను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ పేరును ఖరారు చేశారు. రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర అంతర్జాతీయ సాంకేతిక సంస్థల పేర్లను కూడా సిటీలోని ప్రధాన రహదారులకు పెట్టే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తెలంగాణ, అమెరికాల మధ్య వాణిజ్య, సాంకేతిక పెట్టుబడి సంబంధాల విస్తరణను ఈ నిర్ణయం సూచిస్తోంది.
ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు చెందిన పలు అమెరికన్ ఫార్చ్యూన్ 500 సంస్థలు హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. గత రెండేండ్లలో కాస్ట్‌కో, ఎలి లిల్లీ, మెక్‌డొనాల్డ్స్, వాంగార్డ్, టీ-మొబైల్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి.
నాస్‌కామ్ విడుదల చేసిన ‘జీసీసీ ల్యాండ్‌స్కేప్ రిపోర్ట్- 2026’ నివేదిక ప్రకారం, 2025లో ఇండియాలో ఏర్పాటైన కొత్త బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) జీసీసీలలో 50 శాతం హైదరాబాద్‌లోనే స్థాపితమయ్యాయి. సిటీలో అందుబాటులో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ఇందుకు దోహదపడినట్లు నివేదిక పేర్కొంది.
