మీ కొనుగోళ్లే పిల్లల ప్రాణాలు తీస్తున్నయ్.. చైనా, ఇండియాపై అమెరికన్ సెనేటర్ లిండ్సీ అక్కసు

మీ కొనుగోళ్లే పిల్లల ప్రాణాలు తీస్తున్నయ్.. చైనా, ఇండియాపై అమెరికన్ సెనేటర్ లిండ్సీ అక్కసు

   వాషింగ్టన్: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనాపై అమెరికన్ నేత, రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సీ గ్రాహమ్ అక్కసు వెళ్లగక్కారు. చైనా, ఇండియా ఆయిల్ కొనుగోళ్లతో వచ్చిన డబ్బుతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్​పై యుద్ధం చేస్తున్నారని, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. గురువారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా ప్రయోగించిన మిసైల్, డ్రోన్ దాడుల్లో 23 మంది చనిపోయారు. ఈ చావులకు ఇండియా, చైనాదే పరోక్షంగా బాధ్యత అని గ్రాహమ్ విమర్శించారు.

 పుతిన్‎ను సమర్థిస్తున్నందుకు ఇప్పటికే ఇండియా 50% టారిఫ్‎ల రూపంలో తగిన మూల్యం చెల్లించుకున్నదని ఈ మేరకు ఆయన గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. కీవ్‎పై రష్యా దాడికి సంబంధించిన వార్త క్లిప్‎ను ఈ ట్వీట్‎కు జోడించారు. ‘‘ఇండియా, చైనా, బ్రెజిల్, ఇతర దేశాలు రష్యన్ ఆయిల్‎ను చౌకగా కొనడం ద్వారా పుతిన్ వార్ మిషిన్‎కు బలాన్ని చేకూరుస్తున్నారు. 

మీ కొనుగోళ్ల కారణంగా పిల్లలు, అమాయక పౌరుల ప్రాణాలు పోతుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు..? రష్యాతో వ్యాపారం చేస్తున్న చైనా, బ్రెజిల్ సహా మిగతా దేశాలు కూడా ఇండియా మాదిరిగానే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది” అని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్‎లో పుతిన్ వార్ మిషిన్‎కు ఆయిల్ బయ్యర్లే ఇంధనం సమకూరుస్తున్నారంటూ ఆయన తరచూ విమర్శిస్తున్నారు.