- ట్రంప్ సలహాదారు నవారో ఆగ్రహం..
- ఏఐ డేటా సెంటర్ల వల్ల యూఎస్‌లో కరెంటు చార్జీల మోత
- దీనిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
వాషింగ్టన్: భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల కోసం అమెరికన్లు ఎందుకు డబ్బులు చెల్లించాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు పీటర్ నవారో ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న చాట్ జీపీటీ వంటి కంపెనీలు ఇక్కడి కరెంటును వాడుకుంటున్నాయని, సర్వీసులు మాత్రం భారత్.. చైనా వంటి పెద్ద దేశాల వినియోగదారులకు అందజేస్తున్నాయని ఆరోపించారు. పరిష్కరించాల్సిన సమస్యల్లో ఇది కూడా ఒకటని అన్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ కామెంట్లు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఏఐ డేటా సెంటర్ల వల్ల అమెరికాలో విద్యుత్ ధరలు పెరుగుతున్నాయని, దీనిపై ట్రంప్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటుందని నవారో హెచ్చరించారు.
మన దేశంపై నవారో అక్కసు..
గతంలో కూడా పీటర్ నవారో భారత్‌పై అక్కసు వెల్లగక్కారు. భారత్ చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు రష్యాకు ఆర్థికంగా సాయం చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా ఆయిల్ రూపంలో భారత్ బ్లడ్ మనీ తీసుకుంటోందని, ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ యుద్ధమని, భారత్ అత్యధికంగా పన్నులు వసూలు చేసే దేశమని కామెంట్లు చేశారు.
