న్యూఢిల్లీ: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అల్లర్లు చెలరేగుతాయని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అతని వ్యాఖ్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని పేర్కొంది. కర్నాటకలోని బెలగావి జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో అమిత్షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేర్లో వెళ్తుందని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయని, రాష్ట్రం అల్లర్లతో అల్లాడిపోతుందని అన్నారు.
కాగా, అమిత్షా కామెంట్లపై బుధవారం కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి, జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ స్పందించారు. “ఇది బెదిరింపు ప్రకటన. ఇండియా తొలి హోంమంత్రి నిషేధించిన సంస్థకు విధేయత చూపిస్తున్న ఇప్పటి కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంలో బెదిరింపులకు దిగుతున్నారు. కర్నాటకలో బీజేపీ నిర్ణయాత్మకంగా ఓడిపోతోందని ఇప్పుడు తేలిపోయింది” అని ట్వీట్ చేశారు.