మూడోసారి మోదీనే ప్రధాని దేశంలో 400 సీట్లు

మూడోసారి మోదీనే ప్రధాని దేశంలో 400 సీట్లు
  • రాష్ట్రంలో 12 సీట్లు టార్గెట్: అమిత్​ షా
  •     కాంగ్రెస్​, బీఆర్ఎస్​లు మజ్లిస్​తో అంటకాగుతున్నయ్​
  •     మా ఓటు బ్యాంకును చూసి ఆ రెండు పార్టీలు భయపడుతున్నయ్​
  •     కాంగ్రెస్​, బీఆర్ఎస్​, మజ్లిస్​ మూడూ కుటుంబ పార్టీలే
  •     బీఆర్​ఎస్​ అంటే భారతీయ భ్రష్టాచార్​ సమితి
  •     సీఏఏ పౌరసత్వం ఇచ్చేదిగానీ.. గుంజుకునేది కాదు
  •     ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్​ కమిటీ అధ్యక్షులతో సమావేశం

హైదరాబాద్​, వెలుగు: మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ధీమా వ్యక్తంచేశారు. తాను దేశంలోని చాలా రాష్ట్రాలకు వెళ్లానని, ఎక్కడికెళ్లినా మోదీనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సారి బీజేపీ కచ్చితంగా 400 సీట్లు గెలుస్తుందని, అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు పైగా సీట్లలో బీజేపీని గెలిపించాలని సూచించారు. 75  ఏండ్లు అవుతున్నా రాష్ట్రంలో నిజాం పాలన ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని, దాని నుంచి విముక్తి కలగాలంటే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​పార్టీలు మజ్లిస్​తో అంటకాగుతున్నాయని తెలిపారు. ఆ రెండు పార్టీలు మజ్లిస్​ ఎజెండాతోనే పనిచేస్తాయని ఆరోపించారు. 

ఆ పార్టీలతో నిజాం పాలన అంతమవుతుందా? అని ప్రశ్నించారు.  కాంగ్రెస్​ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో  గెలవగానే మజ్లిస్​ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్​గా చేసిందన్నారు. ఆ రెండు పార్టీలు హైదరాబాద్​ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని, సర్దార్​ పటేల్​కు నివాళులర్పించలేదని మండిపడ్డారు. అవి ఓటు బ్యాంకును చూసి భయపడతాయని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో పార్టీ బూత్​ కమిటీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో అమిత్​ షా మాట్లాడారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​, మజ్లిస్​ మూడూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్​లో జవహర్​లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్​ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్​ గాంధీ అధికారం కోసం అర్రులు చాస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్​లో  కేసీఆర్​, ఆ తర్వాత కేటీఆర్​, మజ్లిస్​లో బడే మియా, ఛోటేమియాల కేంద్రంగానే రాజకీయాలు నడుస్తాయని ఎద్దేవా చేశారు.  

అవినీతిలో మునిగిపోయినయ్​

కాంగ్రెస్​, బీఆర్ఎస్​ పూర్తిగా అవినీతిలో మునిగిపోయాయని అమిత్​ షా ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని, సీఎం రేవంత్​ రెడ్డికి దమ్ముంటే తాను చెప్పేవి అబద్ధాలేనని నిరూపించాలని సవాల్​ విసిరారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు, కామన్వెల్త్​, బోఫోర్స్​, అగస్టా వెస్ట్​ల్యాండ్​ హెలికాప్టర్​ స్కామ్​, శారదా చిట్​ఫండ్​ స్కామ్ సహా ఎన్నో స్కామ్​లకు పాల్పడిందన్నారు. బీఆర్ఎస్​ అంటే భారతీయ భ్రష్టాచార్​ సమితి అని, ఆ పార్టీ మియాపూర్​ భూముల కుంభకోణం, 4000 కోట్ల ఓఆర్​ఆర్​ కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టులో 40 వేల కోట్ల అవినీతి, లిక్కర్​ స్కామ్​, కాగ్​ ఆడిట్​ కుంభకోణాలకు పాల్పడిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఆఠాణ అవినీతి కూడా జరగలేదని పేర్కొన్నారు.  

హామీలను విస్మరించిన బీఆర్​ఎస్​

నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ ఉద్యమం సాగిందని, కానీ, బీఆర్​ఎస్​ వాటిని విస్మరించిందని అమిత్​ షా విమర్శించారు. నీళ్లు ఇవ్వలేదని, లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల భర్తీ చేపట్టలేదని, పేపర్​ లీకులు చేసి 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నదని మండిపడ్డారు. 7 లక్షల ఇండ్లు ఇస్తామని మోసం చేసిందని అన్నారు. పేదరికాన్ని అంతం చేస్తామంటూ ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్​ హామీ ఇచ్చిందని, కానీ, పేదరికం తగ్గకపోగా మరింత పెరిగిందని విమర్శలు గుప్పించారు. కానీ,  ప్రధాని నరేంద్ర మోదీ 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రేషన్​ అందిస్తున్నారని చెప్పారు. 4  కోట్ల మందికి ఇండ్లు కట్టించారని, 10  కోట్ల మంది మహిళలకు ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్​ ఇచ్చారని తెలిపారు. 14  కోట్ల ఇండ్లకు సురక్షితమైన తాగు నీరు అందించారని, 11 కోట్ల మంది రైతులకు ఏటా పెట్టుబడి సాయం అందిస్తున్నారని తెలిపారు. 

కశ్మీర్​ మనదా? కాదా?

కశ్మీర్​ మనదా? కాదా? చెప్పాలంటూ ప్రజలను అమిత్​ షా ప్రశ్నించారు. ఒకప్పుడు కశ్మీర్​లో ఎటు చూసినా సైనికులే ఉండేవారని, జాతీయ జెండానూ ఎగరేసే స్వేచ్ఛ కూడా ఉండేది కాదని అన్నారు. కానీ, ఇప్పుడు అన్ని పండుగలను స్వేచ్ఛగా చేసుకుంటున్నారని చెప్పారు. హిందువుల 500 ఏండ్ల కల అయిన అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని సాధ్యం చేశామని తెలిపారు. కానీ, కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రం రామ్​ లల్లాను ఏండ్ల కొద్దీ టెంట్​ కిందే ఉంచిందని, కోర్టు కేసులను ముందుకు సాగనివ్వలేదని అన్నారు. మోదీ హయాంలో రామాలయాన్ని నిర్మించుకున్నామని, ఈ ఏడాది జనవరి 22న రామ్​ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఏ హామీనీ నెరవేర్చలేదని తెలిపారు.  ట్రిపుల్​ తలాక్​ను రద్దు చేసి ముస్లిం ఆడపడచులకు న్యాయం చేశామని చెప్పారు. ఒవైసీకి భయపడి కాంగ్రెస్​ ఏనాడూ ట్రిపుల్​ తలాక్ రద్దుకు ముందుకురాలేదని విమర్శించారు. 

కాంగ్రెస్​ పాలనలో ఎప్పుడూ ఉగ్రదాడులే

కాంగ్రెస్​ హయాంలో ఉగ్రవాదులు సరిహద్దులు దాటొచ్చి బాంబు పేలుళ్లకు పాల్పడేవారని అమిత్​ షా పేర్కొన్నారు. కానీ, మోదీ ప్రధాని అయ్యాక యురీ, పుల్వామా దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. పాకిస్తాన్​​ భూభాగంలోకి వెళ్లి సర్జికల్​ స్ట్రైక్స్​, ఎయిర్​స్ట్రైక్స్​ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టామని గుర్తుచేశారు. ఇప్పుడు సీఏఏని అమలు చేస్తున్నామని తెలిపారు. పాకిస్తాన్​, అఫ్గానిస్తాన్​​, బంగ్లాదేశ్ నుంచి వచ్చి దేశంలో షెల్టర్​ పొందుతున్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు పౌరసత్వం ఇస్తామని తెలిపారు. కానీ, కాంగ్రెస్​, మజ్లిస్​ వంటి పార్టీలు ఆయా దేశాల్లో అణచివేతకు గురవుతున్న హిందువులకు పౌరసత్వం ఇవ్వకుండా అడ్డుపుల్ల వేస్తున్నాయని ఫైర్​ అయ్యారు. తెలంగాణ కోసం ఎన్నో చేస్తున్నం తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్​ షా చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం 2.25 లక్షల కోట్ల గ్రాంట్​ ఇచ్చిందని వెల్లడించారు.  రైల్వేలు, హైవేలు, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ వంటి వాటిని మంజూరు చేసి రూ.5 లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేసినట్టు చెప్పారు. 

డెవలప్​మెంట్​ ఎజెండాతోనే ప్రచారానికి

మోదీ హయాంలో పదేండ్లలో జరిగిన అభివృద్ధి ఎజెండాతోనే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి పోవాలని అమిత్​షా సూచించారు. ప్రస్తుతమున్న సర్వేల ప్రకారం తెలంగాణలో12 సీట్లు గెలవబోతున్నామని, ఇంకా కష్టపడితే 15 సీట్లను కైవసం చేసుకోవచ్చని తెలిపారు. బేగంపేటలోని ఓ హోటల్ లో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్లు, ఇన్​చార్జిలు, పొలిటికల్ ఇన్​చార్జిలతో భేటీ అయ్యారు. ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించగా, త్వరలోనే మిగితా అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే, త్వరలోనే  ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను అమిత్ షా వివరించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 50మందితో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు  ఫోన్లు చేయించాలని కోరారు. పనులను సమన్వయంతో చేసుకోవాలని, ఇతర పార్టీలకు చెందిన కిందిస్థాయి కేడర్ ను పార్టీలో చేర్చుకోవాలని సూచించారు. సమావేశంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి వెళ్లడం మోదీతోనే సాధ్యం

చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఏ దేశమూ వెళ్లలేకపోయిందని, కానీ, మన దేశం జెండా ఎగరేసిందని అమిత్​ షా చెప్పారు. అది కేవలం మోదీ పాలనతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. జీ20 సదస్సుతో మన దేశ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు.మోదీ పనితీరు చూసి 14 దేశాలు ఆయా దేశాల్లో అత్యున్నత పురస్కారాలను అందించాయని తెలిపారు. ఆయన ఎక్కడికెళ్లినా మోదీ మోదీ అంటూ ప్రజలు స్వాగతం పలుకుతారని తెలిపారు. బీజేపీ గెలిచేంత వరకు కార్యకర్తలు విశ్రమించవద్దని, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

సీఏఏ.. ఏ మతానికీ వ్యతిరేకం కాదు: కిషన్ రెడ్డి 

దేశంలో సీఏఏ అమలవుతోందని, ఇది మోదీ గ్యారంటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ చట్టం ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉన్నారని, మరి కాంగ్రెస్ లో పీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తోడుదొంగలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవీలత, రాములు, బీబీ పాటిల్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఈటల రాజేందర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాకేశ్ రెడ్డి,  పొంగులేటి సుధాకర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, దుగ్యాల ప్రదీప్ రావు, ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రాజాసింగ్, బాపురావు డుమ్మా 

ఎల్బీస్టేడియంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ను ఇటీవలే బీజేపీలో చేరిన నాగేశ్ కు ఇస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో పార్టీ నేతలపై బాపురావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజాసింగ్ కూడా సమావేశానికి రాలేదు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఎంపిక చేయడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 

అవినీతిని అంతం చేశాం

కంటోన్మెంట్, వెలుగు:  పదేండ్లలోనే అవినీతిని అంతం చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్​లో మంగళవారం నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, -బీఆర్ఎస్, ఎంఐఎం మూడూ ఒక్కటేనని.. అవి ఒకే ఎజెండాతో ​పనిచేస్తున్నాయన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలకు ప్రజల శ్రేయస్సు పట్టదన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతి చిట్టా తన వద్ద ఉందని, దానిని సీఎం రేవంత్ రెడ్డికి పంపుతానన్నారు.  అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకున్న తర్వాతే రేవంత్ బీజేపీని విమర్శించాలని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్​కు ఓటు వేస్తే.. చెత్తబుట్టలో వేసినట్లేనని అన్నారు. ఆరు గ్యారంటీలతోఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గ్యారంటీల అమలులో ప్రచారానికే పరిమితమైందన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ నేతలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.