- ఈ దారుణంపై దేశమంతా జవాబు కోరుతోంది..
- రాహుల్ గాంధీ ఆగ్రహం
- సివిల్ దుస్తుల్లో విద్యార్థులపై దాడి చేసింది ఎవరు..?
- ప్రాణాంతక ఆయుధాలకు అనుమతించింది ఎవరని ప్రశ్న
- కేంద్ర హోం మంత్రికి లోక్‌సభ ప్రతిపక్ష నేత లేఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై భద్రతా దళాలు జరిపిన అత్యంత పాశవిక దాడికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖే పూర్తి జవాబుదారీతనం వహించాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ దారుణకాండపై దేశమంతా సమాధానం కోరుతున్నదని, అసలు ప్రాణాంతక ఆయుధాల వినియోగానికి ఎవరు అనుమతి ఇచ్చారు? అని అమిత్ షాను రాహుల్ నిలదీశారు. జులై 20న విద్యార్థులపై పెల్లెట్ గన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని తప్పుబడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ రాశారు.
విద్యావ్యవస్థలో జవాబుదారీతనం, పేపర్ లీకేజీలకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్న యువతపై భద్రతా దళాలు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయని మండిపడ్డారు. ‘‘చేతిలో జాతీయ జెండా పట్టుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 19 ఏండ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్‌పై పెల్లెట్ గన్‌తో దాడి చేశారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆ యువకుడు ఇప్పుడు ఒక కంటి చూపు కోల్పోయే ప్రమాదం
లో పడ్డాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖలో ప్రశ్నల వర్షం..
హోంమంత్రికి అమిత్ షాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ పలు సూటి ప్రశ్నలు సంధించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లు, టియర్ గ్యాస్ లాంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడానికి హోంమంత్రిగా మీరు అనుమతించారా..? లేకపోతే ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు..? అని అడిగారు. నిరసనకారులపై లాఠీలతో విరుచుకుపడిన సాదాసీదా దుస్తుల్లో ఉన్న వ్యక్తులు పోలీసులా లేక ఏదైనా ప్రైవేట్ సంస్థల వలంటీర్లా..? వారిని ఎవరు రంగంలోకి దించారు..? అని ప్రశ్నించారు.
దాడుల్లో వందలాది మంది గాయపడ్డారని, మహిళా విద్యార్థినుల పట్ల పోలీసులు అత్యంత జుగుప్సాకరంగా, అమానుషంగా ప్రవర్తించా రని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కును కాలరాస్తూ చేసిన ఈ దాడిపై ప్రధాని మోదీ తక్షణమే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
