ఫౌండేషన్ పేరుతో బెగ్గింగ్ దందా

ఫౌండేషన్ పేరుతో బెగ్గింగ్ దందా

హైదరాబాద్, వెలుగు: అనాథలు, దివ్యాంగులకు చేయూత ఇస్తున్నామని మోసాలకు పాల్పడుతున్న ‘అమ్మ చేయూత ఫౌండేషన్’ గుట్టు రట్టయింది. చేయూత పేరుతో డొనేషన్లు వసూలు చేస్తున్న 10 మంది సభ్యుల నకిలీ ఎన్జీఓ గ్యాంగ్​ను మలక్ పేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఫౌండేషన్  వ్యవస్థాపకుడితో పాటు ఇద్దరు బెగ్గింగ్ నిర్వాహకులు, ఏడుగురు మహిళలను రిమాండ్​కు తరలించారు. వారి వద్ద రూ.1.22 లక్షల నగదు, కలెక్షన్ బాక్సులు, ఫౌండేషన్  ఐడీ కార్డులు, ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం. నిజామాబాద్  జిల్లా ఆర్మూర్​కు చెందిన గడ్డి గణేశ్ (43) నాలుగేండ్ల క్రితం ఎల్బీ నగర్ మన్సూరాబాద్​లో ‘అమ్మ చేయూత ఫౌండేషన్’ ప్రారంభించాడు. 

గ్యాంగ్  సభ్యులు కొంత కాలం డొనేషన్లు వసూలు చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఫౌండేషన్  కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ క్రమంలో మీర్ పేట్​లోని నంది నగర్, ఆర్ఎన్ రెడ్డిలో నివాసం ఉండే ఆటోడ్రైవర్లు కెతావత్  రవి (35), కెతావత్ మంగు (30)  2020లో గణేశ్​ను సంప్రదించారు. అమ్మ చేయూత ఫౌండేషన్  పేరుతో పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని వారు గణేశ్​కు చెప్పారు. ఫౌండేషన్​కు సంబంధించిన లోగో, ఐడీ కార్డులు, నగదు వసూళ్ల కోసం స్టీల్  బాక్సులు సిద్ధం చేశారు. తమకు తెలిసిన మహిళలతో గ్యాంగ్స్ ఏర్పాటు చేశారు. ఫౌండేషన్  పేరుతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద డబ్బులు వసూలు చేయాలని చెప్పారు. అందరికీ తెలుపు రంగు  ఆప్రాన్, క్యాప్స్, ఫౌండేషన్ ఐడీ కార్డులు ఇచ్చి, ఆటోలో వారిని సిటీలో రద్దీగా ఉండే ట్రాఫిక్  సిగ్నల్స్ వద్ద డ్రాప్ చేస్తున్నారు. 

ఇందు కోసం నందినగర్​లో నివాసం ఉంటున్న రమావత్  అనూష (18), బనవత్ సంగీత (28), నెనావత్  శైలజ (26), రమావత్ ఎల్లమ్మ (20), సబావత్  సునీత (26), కెతావత్  సరోజ(25) తో ఆటోడ్రైవర్  మంగు భార్య  కెతావత్  చిల్కి (25) బెగ్గర్ల గ్యాంగ్ తయారు చేసింది. వారిని రోజూ సిగ్నల్స్ వద్ద డ్రాప్ చేసి రాత్రి 9 వరకు డొనేషన్స్ కలెక్ట్ చేయిస్తున్నారు. ఇలా ఫౌండేషన్  పేరుతో వసూలు చేసిన రోజువారి కలెక్షన్లలో 34% బెగ్గర్స్ వాటాగా ఇచ్చారు. మిగిలిన డబ్బులో ఫౌండేషన్  వ్యవస్థాపకుడు గణేశ్​కు అతను ఇచ్చిన 12 బాక్సులకు రవి, మంగు రూ.2 వేలుచెల్లించారు. గత మూడేండ్లలో ఆ ఇద్దరూ భారీగా ఆస్తులు కూడబెట్టారు. నాదర్ గుల్, బడంగ్ పేట్, తుర్కయాంజల్ లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు.