ఎమ్మెల్యే అభ్యర్థులకు.. ఖర్చుల బుగులు

ఎమ్మెల్యే అభ్యర్థులకు.. ఖర్చుల బుగులు
  • డిసెంబర్‌‌ దాకా ప్రచారానికి ఎన్ని కోట్లు ఐతయోనని టెన్షన్
  • ఓటర్లు, క్యాడర్‌‌‌‌ను కాపాడుకోవడంపై ఆందోళన
  • వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు
  • ఎక్కడ ఏ వేడుక జరిగినా జేబులోంచి తీసివ్వాల్సిందే
  • బీఆర్ఎస్ అభ్యర్థుల ముందస్తు ప్రకటనతో క్యాంపెయిన్ షురూ
  • వచ్చే మూడు నెలల్లో రూ.30 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం
  • ఒక్కో అభ్యర్థికి సగటున కనీసం రూ.50 కోట్ల దాకా ఖర్చు!

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల్లో ఖర్చుల బుగులు మొదలైంది. అప్పుడే ఎన్నికల వాతావరణం ఏర్పడటంతో ఏకంగా మూడు నెలల పాటు ఓటర్లను, క్యాడర్‌‌‌‌ను కాపాడుకోవడమెలా అనే టెన్షన్ పట్టుకుంది. రానున్నదంతా పండుగల సీజన్ కావడంతో ఖర్చులు తడిసి మోపెడు అవుతాయని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు టికెట్ వచ్చిందని ఆనందంలో ఉన్న అధికార పార్టీ నేతలు.. మరోవైపు ఎన్ని కోట్లు కుమ్మరించాలోనని ఆందోళన చెందుతున్నారు. వచ్చే డిసెంబర్ దాకా ఏ వేడుక జరిగినా తమ జేబులో నుంచి తీసి ఖర్చు చేయాల్సి ఉంటుందని, అది ఎంత దాకా పోతుందోనని ఆలోచిస్తున్నారు.

షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఇంకా నెలపైనే టైం ఉండటంతో ఖర్చు మూడింతలు అవుతుందని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో గతంలో జరిగిన బై ఎలక్షన్స్ కోసం క్యాండిడేట్లు వందల కోట్లు ఖర్చు చేశారు. హుజూరాబాద్, మునుగోడు బై ఎలక్షన్​లో మూడు, నాలుగు నెలల పాటు నియోజకవర్గంలో ఏది జరిగినా అభ్యర్థులే తమ జేబులోంచి తీసిచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు, క్యాండిడేట్లది కలిపి మొత్తంగా రూ.30 వేల కోట్ల మేర ఖర్చు ఉంటుందని ఓ అంచనా. ఓట్ల కోసం చివరి రెండు, మూడు రోజుల్లో ఖర్చు చేసేది అటుంచితే.. ప్రచారం పేరిట చేసేదే ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు వరుసగా వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉన్నాయి. వీటికి ఖర్చులన్నీ అభ్యర్థుల మెడకే చుట్టుకోనున్నాయి.

వినాయకచవితి, బతుకమ్మ, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు వరుసగా వస్తున్నాయి. ఒక్కో నెలలో.. ఒక్కో పండుగ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ చివరి వారంలో లేదంటే డిసెంబర్ మొదటి, రెండో వారం లోపు పోలింగ్ పూర్తవుతుంది. సెప్టెంబర్‌‌‌‌లో వినాయక చవితి ఉన్నది. రాష్ట్రంలో ప్రతి గల్లీలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. దీంతో నియోజకవర్గాల్లో పోటీలో ఉండే అభ్యర్థులందరూ పోటీ పడిమరి వినాయకుడి ప్రతిమలను ఇప్పించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వినాయకుడి నిమజ్జనం వరకు అయ్యే ఖర్చులు కూడా భరించేందుకు సిద్ధమవుతున్నారు. తర్వాత అక్టోబర్‌‌‌‌లో దసరా పండుగ జరగనుంది.

అంతకంటే ముందే తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ కూడా అదే నెలలో జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బతుకమ్మ చీరలతో పాటు అభ్యర్థులు కూడా చీరలు పంపిణీ చేసేందుకు బల్క్ ఆర్డర్లు పెడుతున్నట్లు తెలిసింది. చీరలతో పాటు గాజులు, మేకప్ బాక్స్‌‌లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దసరా అంటే రాష్ట్రంలో దావత్‌‌లు కామన్. దీంతో ఈ పండుగకు యాటలు ఇప్పివ్వడం, సెపరేట్‌‌గా ఫుల్ బాటిళ్లు పంపిణీ చేయడం వంటివి ఉండనున్నాయి. దీనికే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో ఉంది. ఇక తర్వాత దీపావళి నవంబర్‌‌‌‌లో వస్తుంది. దీనికి స్వీట్ బాక్సులతో పాటు పటాకులు పెద్ద ఎత్తున పంపిణీ చేయాలి. గత మునుగోడు బై ఎలక్షన్‌‌లోనూ ఇలాగే పంపిణీ చేశారు. దీంతో పోటీ చేయనున్న, చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఖర్చు విషయంలో భయపడిపోతున్నారు.

గట్టి పోటీ ఉన్న చోట 100 కోట్లపైనే

ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ చాలా స్థానాల్లో హోరాహోరీగా పోటీపడనున్నాయి. దీంతో ఖర్చు ఆకాశాన్నంటనుంది. ఒక్కో క్యాండిడేట్‌‌కు యావరేజ్‌‌గా రూ.50 కోట్లు.. టఫ్ అనుకున్న ప్రాంతాల్లో రూ.100 కోట్లు పైనే ఖర్చు అయ్యే చాన్స్ ఉంది. కార్యకర్తలను మెయింటైన్ చేయడం వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఎక్కడ ఏ చిన్న మీటింగ్ పెట్టినా డబ్బులు ఇవ్వనిదే ఎవరూ రావడం లేదు. బీర్లు, బిర్యానీ పొట్లాలు లేకుండా సమావేశాలు, ప్రచారానికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియా టీమ్స్ మెయింటైన్ చేయాలి. రోజూ వాహనాల ఖర్చు, ఏ గ్రామానికి వెళ్తే అక్కడ ఏర్పాట్లు, తమ వద్దకు వచ్చే కుల సంఘాల నేతలు, సభ్యులను కాపాడుకోవడం వంటివి తప్పక చేయాలి. మూడు నెలల పాటు ఇవన్నీ చూసుకోవాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఆయా నియోజకవర్గాల్లో ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే..

వ్యతిరేకత రావద్దన్న కారణంతో వెంటనే పరిష్కరిస్తున్నారు. కమ్యూనిటీ హాల్స్‌‌కు, గుడులు, రోడ్లకు సొంత పైసలు ఇచ్చుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలను కొనడానికే కాకుండా సొంత పార్టీలోని నేతలు చేజారకుండా కూడా భారీ మొత్తాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికలకు ఎక్కువ టైం ఉండటంతో క్యాడర్‌‌‌‌లో ఎవరైనా పార్టీ మారితే డబ్బు ముట్టజెప్పుకుని మళ్ల దగ్గరకి తీసుకోవాల్సి ఉంటుందనే భయం అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. టికెట్ వస్తుందో లేదో అన్న అనుమానం ఉంటే.. ఖర్చు చేసేందుకు కొంచెం వెనుకాడే వారు. ఇప్పుడు స్పష్టత రావడంతో అంతా వాళ్లే ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 

నోటిఫికేషన్ వచ్చేదాకా లెక్కలుండయ్

ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో అయితే ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో అయితే గరిష్ఠంగా రూ.28 లక్షలు ఖర్చు చేయొచ్చు. పార్లమెంటు స్థానాల విషయానికొస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.95 లక్షలు , చిన్న రాష్ట్రాల్లో రూ.75 లక్షలు ఖర్చుపెట్టవచ్చు. అయితే ఈ లెక్కలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతి నుంచే మొదలవుతాయి. అప్పటి వరకు పార్టీలపై, క్యాండిడేట్లపై ఎలాంటి నిఘా ఉండదు. దీంతో ఇదే అదునుగా భావిస్తున్న అధికార పార్టీ.. చాలా ఖర్చులు నోటిఫికేషన్ కంటే ముం దుగానే చేయాలని చెప్పినట్లు తెలిసింది. 

టికెట్ వచ్చిందన్న సంతోషం ఒక దిక్కు.. ఈ మూడు నెలలు ఎంత ఖర్చు చేయాలో అనే ఆందోళన ఇంకోదిక్కు. టికెట్ ప్రకటించిన రోజే నియోజకవర్గంలోని గ్రామాల్లో సెలబ్రేషన్స్ కోసం రూ.40 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక ముందున్న కాలం చూస్తుంటే దగడు పుడుతున్నది. క్యాడర్, లీడర్లు ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ ఎట్లా మారుతారో తెల్వదు.. వాళ్లను మేనేజ్ చేయాలి. పైసలు తీయకుంటే ఎవ్వరూ దగ్గరకొస్తలేరు. తిరగాలంటే ప్రచారానికి రోజూ ఖర్చు చేయాలె. ఎన్ని కోట్లు అయితదో ఏందో?

ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆవేదన 

నియోజకవర్గంలో ఇప్పుడే పైనుంచి 

ఊర్లు అన్నీ తిరగమని ఆదేశాలు వచ్చినయ్. ఎలక్షన్ మూడ్‌‌లోకి పోయినం. ఇప్పుడు పోటీ పడి మరీ పండుగలన్నీ ఎల్లదీయాలే. ఊర్లలో శ్రావణంలోనే బోనాలు తీస్తరు. ఇప్పుడు బోనాలకు ఏర్పాట్లు చేస్తున్నం. వినాయక చవితి వస్తుంది. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో నిమజ్జనం పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ చూసుకోవాలి. బతుకమ్మ, దసరా, దీపావళి.. వామ్మో కథ తలుసుకుంటేనే భయమైతంది. కోట్ల రూపాయలు ఖర్చు అయితయని తెలుసు.. కానీ ఎన్ని కోట్లు పెట్టాలనేది క్లారిటీ లేనప్పడు ఎవరికైనా భయమైతది.

ఇంకో ఎమ్మెల్యే అభ్యర్థి ఆందోళన